ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ స‌రిగా ఉండాలి

25-11-2026 | 06:10pm

లేని ప‌క్షంలో చ‌ర్య‌లుంటాయ‌న్న‌ హైడ్రా క‌మిష‌న‌ర్‌

ఎస్‌టీపీలో దిగి ముగ్గురు మృతి చెంద‌డం బాధాక‌రం

త్వ‌ర‌లో ఎస్‌టీపీల నిర్వాహ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తాం

కుత్బుల్లాపూర్, నవంబర్ 25(విజయక్రాంతి): న‌గ‌రంలో ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం ఉండ‌రాద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ. రంగ‌నాథ్(Hydra Commissioner AV Ranganath) అన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం వాటిని ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. నిర్వ‌హ‌ణ కూడా స‌రిగా ఉండేలా చూడాల‌న్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌, ఏపీఆర్ ఎన్‌క్లేవ్‌లో మంగ‌ళ‌వారం ఎస్‌టీపీ ట్యాంక్ శుభ్రం చేస్తూ విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌నా స్థ‌లాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధ‌వారం పరిశీలించి ప్ర‌మాదానికి  సంబంధించిన వివరాలను హైడ్రా, సీఎంసీ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక‌రిత‌ర్వాత ఒక‌రుగా ఎస్‌టీపీ ట్యాంకులోకి దిగి ముగ్గురు మృతి చెంద‌డం అత్యంత బాధాకరమని అన్నారు.

ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ప్రైవేటు ఏజెన్సీల‌కు అప్ప‌గించేశాం.. మ‌న ప‌ని అయిపోయింద‌నేట్టు గేటెడ్ క‌మ్యూనిటీలు భావించ‌రాద‌ని పేర్కొన్నారు. ఈ బాధ్య‌త‌లు తీసుకున్న ఏజెన్సీలు కూడా నిర్వ‌హ‌ణ‌కు అనువైన వాతావ‌ర‌ణం ఉందా లేదా.. ఎంత వ‌ర‌కు మురుగు నీరు శుభ్రం అవుతోంది.. నాణ్య‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఆ నీరు ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. ఇవేవీ ప‌ట్ట‌న‌ట్టు ఎస్‌టీపీల‌ను నిర్వ‌హిస్తే బాధ్యుల‌పైన చ‌ర్య‌లుంటాయ‌ని హెచ్చ‌రించారు. ఎస్‌టీపీల నిర్వాహ‌కుల‌తో త్వ‌ర‌లో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి నియ‌మ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే కాకుండా.. వారికి దిశానిర్దేశం చేస్తామ‌న్నారు. ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ‌లో లోపాల‌ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 

ప్ర‌మాద‌క‌ర వాయువులు పేరుకుపోకుండా..

ఎస్టీపీల నిర్మాణంలో విషవాయువులు పేరుకుపోకుండా సరైన వెంటిలేషన్, గ్యాస్ బయటకు వెళ్లే ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ట్యాంకుల్లో విషవాయువులు పేరుకుపోయినప్పుడు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా లోపలికి దిగడం ప్రాణాంతకమవుతుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో సెప్టిక్ ట్యాంక్, ఎస్టీపీ నిర్మాణం, వెంటిలేషన్ వ్యవస్థ, నిర్వహణ భద్రతా ప్రమాణాలపై పరిశీలన అవసరమని సూచించారు. సుల‌భంగా శుభ్రం చేసేందుకు వీలుగా వీటిని నిర్మించాల‌న్నారు.

ఎస్‌టీపీల‌ను శుభ్రం చేసే ప‌ని వారు అందులో శిక్ష‌ణ పొందిన‌వారై ఉండాల‌ని.. ప్రాణ‌వాయువు బీఓపీలు వినియోగించేలా చూడ‌డం నిర్వాహ‌కుల బాధ్య‌త అని అన్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఒక‌రిని కాపాడ‌బోయి మ‌రొక‌రు ఇలా ముగ్గురు విషవాయువుల బారిన పడి ప్రాణాలు కోల్పోయార‌ని.. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేస్తున్న‌ట్టు హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు.

సెప్టిక్ ట్యాంక్ - ఎస్‌టీపీ నిర్వ‌హ‌ణ శుభ్ర‌ప‌రిచే ప‌నుల‌కు సంబంధించి దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్ అసోసియేష‌న్‌కు - హెచ్‌ఆర్‌ ఇన్విరో సంస్థ మధ్య ఒప్పందం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా చర్యలు పాటించారా లేదా, సంబంధిత సంస్థలు, బాధ్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య, డీఎఫ్‌వో గౌతం, ఎస్ ఎఫ్‌వో శ్రీ‌నివాస్ సీఎంసీ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు