ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
సాలూర, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల (Infrastructure) కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ (Inspection) చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులను పరిశీలించి, ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదును తనిఖీ చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హెచ్ఎం రాజీ మంజుశ్రీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ పాఠశాలకు ఐదు అదనపు తరగతి గదులతో పాటు ప్రహరీ గోడ, క్రీడా మైదానం (Playground) మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (Enrollment) మరింత పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ బోధనా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే షోకాజ్ నోటీసులతో సరిపెట్టకుండా నేరుగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు వంద శాతం పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, ఎక్కువ రోజులు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
హైస్కూల్‌కు ఆనుకుని ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలను కలుపుకుని ఇరు పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి గణితంలో ప్రశ్నలు అడిగారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు, చాక్లెట్లు అందజేసి ప్రోత్సహించారు. ఈ తనిఖీలో ఇన్చార్జి డీఈవో సాయాగౌడ్, తహసీల్దార్ ఎం.ఏ.నవాజ్ తదితరులు పాల్గొన్నారు.