ఆద్యంతం థ్రిల్‌ను పంచే ‘అ’
రాహుల్ విజయ్(Rahul Vijay), అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అ’. సాయి బాలి దర్శకత్వంలో(Directed by Sai Bali) స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కే, గ్యారీ బీహెచ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘ఇదేనా ఇదేనా’ సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమాకూర్చిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్ ఆలపించారు.
సుమన్ చిక్కాల ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా కథానాయకుడు రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. “అ’ మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులందరికి థ్రిల్‌ను పంచబోతుంది” అన్నారు. ‘నా కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్ర చేయడం లక్కీగా ఫీలవుతున్నా’నని కథానాయిక అర్చన అయ్యర్ చెప్పింది. దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. “టైటిల్ చుట్టూ ఉన్న అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘికం, అమానుషం..
ఈ పదాల మధ్యే కథ మొత్తం ఉంది” అని తెలిపారు. ‘స్నేహితులు అందరం కలిసి ఈ సినిమా చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో బాగమైనందుకు గర్వంగా ఉంద’ని నిర్మాత గ్యారీ బీహెచ్ చెప్పారు. నటుడు నరేశ్, కో ప్రొడ్యూసర్ అభినవ్, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, సింగర్ షణ్ముఖ్, లిరిసిస్ట్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.