అలాంటి పెళ్లికూతురు మదిలోకి తొంగిచూస్తే వచ్చిన కథే క్రేజీ కళ్యాణం
నరేశ్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai) ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల(Director Bhadrappa Gajula) రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ భద్రప్ప గాజుల.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
మాది తెలంగాణ, సిద్దిపేట జిల్లా పరిధిలోని బండమైలారం గ్రామం. మేడ్చల్ సమీపంలో ఉంటుంది. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. మా కుటుంబంలో ఆర్ట్ ఫామ్‌కు సంబంధించిన రూట్స్ ఉన్నాయి. మా ముత్తాత ఒక సంగీత వాయిద్యం పట్టుకుని కథలు చెప్పేవారట. మా తాత, మా నాన్న ఊరిలో భాగోతాలు జరిగినప్పుడు అందులో క్యారెక్టర్స్‌లో నటించేవారు. అవన్నీ నాకు చెప్పేవారు. అలా నాకు తెలియకుండా సినిమా కళ పట్ల ఇష్టం ఏర్పడింది. నేను చెప్పాలనుకున్న కథలు సినిమా ద్వారా చెప్పాలనుకున్నా.
నేను ఎక్కడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయలేదు. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చేశా. ప్రభుత్వ పథకాలకు సంబంధించి డాక్యుమెంటరీస్, టూరిజం ఫిలింస్ రూపొందించా. 200లకు పైగా వీడియోస్ చేశా. ఆ క్రమంలో ఊర్లకు వెళ్లడం, అక్కడి ప్రజలతో మాట్లాడటం సామాన్యుల జీవితాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కింది. ఇరాన్ మూవీ ‘చిల్డ్రన్ ఆఫ్ హెవెన్’ నాలో స్ఫూర్తి నింపింది. నేను దర్శకుడిగా మారడానికి గల కారణాల్లో అదీ ఒకటి. మన చుట్టుపక్కల జరిగే ఘటనలు, మన జీవిత విశేషాలు, మన చుట్టూ ఉండే పాత్రలే సినిమా కదా అని చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ చూసినతర్వాత అర్థమైంది.
మా ‘క్రేజీ కల్యాణం’ సినిమా కాపీ రెడీగా ఉంది. ఈ నెలలో పెద్ద సినిమాలు ఉన్నందువల్ల థియేటర్స్ దొరకవని 30వ తేదీ రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే, ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల వాయిదా పడటంతో మా సినిమాకు తగినన్ని థియేటర్స్ దొరుకుతాయని రిలీజ్ డేట్ మార్చుకున్నాం. షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నాం. ఈ నెల 16న కొన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి. మాది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాబట్టి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నాం. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయినా అందరికీ అర్థమయ్యేలా మాటలు, యాస ఉంటాయి.
చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ పెళ్లిళ్లకు వెళ్లేవాళ్లం. చదువుకునే అబ్బాయిలతో పోల్చితే సొసైటీ, పరువు అనే పేర్లు చెప్పి అమ్మాయిలకు త్వరగా పెళ్లిళ్లు చేస్తుంటారు. అమ్మాయిలకు కూడా తమ జీవితాల్లో ఏదో ఒకటి సాధించాలని, బాగా చదువుకోవాలని డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ల తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేస్తారు. మిగతా క్లాస్‌మేట్స్ అంతా ఆ పెళ్లికి అతిథులుగా వచ్చి హ్యాపీగా ఉంటే ఆ అమ్మాయి మాత్రం పెళ్లికూతురిలా ఉంటుంది.
అలాంటి సందర్భంలో అమ్మాయి ఆలోచనలు ఎలా ఉంటాయనే పాయింట్ దగ్గర ఈ కథ మొదలైంది. కల్చర్, పరువు పేరుతో మన ఆలోచనలు అమ్మాయిల మీద ఆపాదించకుండా, వాళ్లు ఏం ఆలోచిస్తున్నారు. వాళ్లు జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. ఇప్పటికీ అమ్మాయిలు స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడే పెళ్లిళ్లు అవుతున్నాయి. ఆ పరిస్థితిలో మార్పు రావాలనేదే నా ప్రయత్నం.
‘అక్క, చెల్లి, అమ్మ, నానమ్మ.. ఇలా నా కుటుంబంలోని మహిళల మధ్య పెరిగిన నాకు అమ్మాయి మనసు కోణంలో కథ చెప్పాలనిపించింది. ఆ భావోద్వేగాలు, నేను చూసిన అనుభవాలు అవన్నీ కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశా. సంప్రదాయం, పరువు పేరుతో అమ్మాయిల జీవితాలను అగాథంలో పడేస్తున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లిపీటలెక్కే అమ్మాయిల మదిలోకి తొంగి చూసిన క్షణం పుట్టిన కథే మా ఈ ‘క్రేజీ కళ్యాణం’.
ఈ సినిమా జరిగే ప్రాసెస్‌లో క్యారెక్టర్స్, సీన్స్, మ్యూజిక్.. ఇలా ప్రతిచోటా క్రేజీ అనే పదం ఎన్నోసార్లు విన్నా. ఈ పదం క్యాచీగా అనిపించింది. అందుకే ‘క్రేజీ కల్యాణం’ అనే టైటిల్ పెట్టుకున్నాం. తరుణ్ భాస్కర్ మా సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. ఈ కథ విన్నాక ఆయన క్యారెక్టర్‌కు సరెండర్ అయ్యారు. నవరసాలు పండించారు. బాగా పర్‌ఫార్మ్ చేశారు.
మా చిత్రంలో డాక్టర్ గోరటి వెంకన్న మూడు పాటలు రాశారు. ఆయన జీవితాన్ని చూసే విధానం పాటలో కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా ఆయనతో పరిచయం ఏర్పడటం సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలో నేను కొన్ని యాడ్స్ చేశాను. ఆ టైమ్‌లో నా పనితనం, నిజాయితీ చూసి ఆయనకు నమ్మకం ఏర్పడింది. కొత్తగా సినిమా రూపొందిస్తాడని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నా రాబోయే సినిమా గురించి ప్లాన్ చేసుకుంటా.