తప్పులు చేస్తూ ముందుకు వెళ్లగలిగే వేదిక ఇదొక్కటే!
తెలుగు ప్రేక్షకులకు ‘జెంటిల్‌మెన్’, ‘నిన్ను కోరి’, ‘వకీల్ సాబ్’, ‘35 కథ కాదు’ వంటి చిత్రాలతో సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నివేదా థామస్(Actress Nivetha Thomas ) సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఒక కొత్త సినిమా షూటింగ్ మొదటి రోజు సెట్సోలోకి అడుగుపెడుతున్న వేళ తన మనసులోని భావాలను పంచుకుంటూ ఆమె ఈ ఎమోషనల్ నోట్‌ను రాసుకొచ్చింది.
“అంతా సిద్ధమైంది! ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి నేను సిద్ధమవుతున్నా. ఇది నాకు అలవాటైన ప్రపంచమే అయినప్పటికీ.. ఎంతో అవసరమైనది, తనదైన శైలిలో వైవిధ్యమైనది. ఒక కొత్త సినిమా సెట్లో మొదటి రోజు అడుగుపెట్టే ముందు నాలో ఒక రకమైన భయం, ఆందోళన కలుగుతోంది. అయితే అది కంగారు పెట్టే ఆందోళన కాదు.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాననే ఉత్సాహం” అని పేర్కొంది నివేదా.
సినిమా సెట్ గురించి చెబుతూ.. ‘ఎలాంటి మొహమాటం లేకుండా నేను తప్పులు చేయడానికి, వైఫల్యాలను చవిచూడటానికి, అన్ని విషయాలు సరిగ్గా సరిపోయేంతవరకు మళ్లీమళ్లీ నేర్చుకోవడానికి ఇదొక్కటే సరైన వేదిక. మనం పొరపాట్లు చేస్తూ, తడబడుతూ ముందుకు సాగుతున్నప్పుడు వందలాది మంది మనల్ని నిశితంగా గమనిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇతరులు ఏమనుకుంటున్నారనే ఆలోచనల జోలికి వెళ్లకుండా,
ఆగిన చోటు నుంచే తిరిగి ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలో సినిమా రంగాన్ని చూసే నేర్చుకోవాలి. సినిమా అనే అద్భుతమైన కళ నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అంటూ నివేదా థామస్ రాసుకొచ్చింది. చివరగా ‘35 చిన్న కథ కాదు’ చిత్రంలో తన నటనకు గానూ అవార్డు దక్కించుకున్న నివేదా థామస్, కొద్దిరోజులు విరామం తర్వాత ఇప్పుడు సరికొత్త ఫ్యామిలీ డ్రామా ‘శ్రీమతి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై సినీ ప్రియులను ఆకట్టుకోగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ ప్రారంభం కానుందనే విషయాన్ని నివేదా థామస్.. తాజాగా ఇలా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఈ పోస్టును చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.