ఆదర్శ కుటుంబంతో సిక్సర్ కొట్టబోతున్నాం
విక్టరీ వెంకటేశ్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47(Adarsha Kutumbam House No. 47)’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. “నేను ఫ్యామిలీ సినిమాలు చాలా చేశాను. కానీ, ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది.
ఏం జరిగినా నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఈ ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను, వాళ్లతోనే ఉంటాను.. అదే ఆదర్శ కుటుంబం. అభిమానుల ప్రేమ ఉంటే చాలు నాకు. మొదటి నుంచి నాకు ఆ ప్రేమను ఇస్తూనే ఉన్నారు. మన ఇండియన్ క్రికెటర్లు ఎలా సిక్సర్లు కొడుతున్నారో.. ఈ సినిమాతో స్టేడియం బయట మేము అలా సిక్సర్లు కొడతాం” అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “రచయితగా నా ప్రయాణాన్ని వెంకటేశ్ ‘పవిత్ర బంధం’ సినిమాతోనే మొదలుపెట్టాను. ఓ రకంగా ఆయన నాతో ఓనమాలు దిద్దించారు. అందుకే నేను వెంకటేశ్‌కి ఎప్పుడు కృతజ్ఞుడినై ఉంటాను. కుటుంబాన్ని మనం సెలెక్ట్ చేసుకోము.
ఏ అమ్మానాన్నకి పుట్టాలి, ఏ ఊళ్లో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి అది మన చేతుల్లో ఉండదు. కుటుంబం మనకు ఇవ్వబడుతుంది. అలా ఒక ఇవ్వబడిన కుటుంబం, ఇవ్వబడిన బంధాలు, వాటిని కాపాడుకోవడానికి నలుగురు మనుషులు. చిట్టిబాబు, స్వర్ణ, సంపూర్ణ, సర్వ అనే నలుగురు మనుషులు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎంత దూరం వెళ్లారు? ఒక సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం ప్రయాణం చేయగలడు? అది ఈ సినిమా తాలూకు కథ.
ప్రపంచ ఇలా ఉంటుందని దాదాపు 5000 సంవత్సరాల క్రితమే ఉద్ధవ గీతలో కృష్ణుడు చెప్పాడు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమాజంలో కుటుంబం మాత్రమే మనకింకా తోడుగా ఉంది. అందుకే నేను కుటుంబ బంధాలను గానీ, కుటుంబ విలువలను గానీ అంతలా ఇష్టపడతాను. వాటి గురించి పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తాను. కుటుంబ కథలకు కేరాఫ్ అడ్రెస్ వెంకటేశ్. ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన హీరో వెంకటేశ్” అని తెలిపారు.
కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. “తెలుగు అమ్మాయిలా అనిపించాలని నేను సొంతంగా డబ్బింగ్ చెప్పాను. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడం వరంలా భావిస్తున్నా. వెంకటేశ్‌ను అందరూ దశాబ్దాలుగా ఎంతో అభిమానిస్తూ వస్తున్నారు. షూటింగ్ సమయంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా” అని చెప్పింది. సంగీత దర్శకుడు తమన్, నటీనటులు నివేదా పేతురాజ్, బ్రహ్మాజీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.