దారులన్ని మూసీ!

29-10-2026 | 05:50am
  1. మూసీ ప్రాజెక్ట్ ప్రజాభిప్రాయ సేకరణపై పోలీసుల నిఘా 
  2. సమావేశానికి వెళ్లకుండా బీఆర్‌ఎస్ నేతల అడ్డగింత 
  3. నాయకుల అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్రిక్తత 
  4. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్
  5. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కు పోలీసుల బ్రేక్
  6. ప్రభుత్వ తీరుపై గులాబీ నేతల మండిపాటు
  7. ప్రజల వద్దకు వెళితే అడ్డుకుంటారా: కేటీఆర్

రంగారెడ్డి బ్యూరో/రాజేంద్రనగర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అట్టుడికింది. బీఆర్‌ఎస్(BRS) నాయకుల అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్రిక్తతలకు దారితీసింది. మూసీ ప్రాజెక్ట్(Musi Project) బాధితులతో సమావేశం కావాల్సిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. మూసీ ప్రాజెక్టు వల్ల ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులను పలకరించి, వారి సమస్యలను తెలుసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు నిర్ణయించారు.

ఈ మేరకు బుధవారం రాజేంద్రనగర్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంపై ప్రభుత్వం, పోలీస్ శాఖ నిఘాపెట్టింది. భారీ స్థాయిలో పోలీసులను సమావేశం పరిసరాల్లో మోహరించారు. మీటింగ్‌కు చేరుకునే దారులను మూసివేసి నాయకులు వేదిక వద్దకు రాకుండా అడ్డుకు న్నారు. ఇక సమావేశానికి హాజరుకావాల్సిన మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి(former minister Sabitha Indra Reddy)ని శ్రీనగర్‌కాలనీలోని ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిలువరించారు. ఆమెతోపాటు కుమారుడు కార్తీక్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. 

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను కూడా సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. శ్రవణ్‌తోపాటు కురువ విజయ్, సోమాజిగూడ మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, కడారి స్వామి, షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్‌ను కంచన్‌భాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాము ఎలాంటి నిరసనలకు పిలుపునివ్వలేదని, కేవలం ప్రజల గొంతుకగా నిలిచేందుకు వెళ్తుంటే ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకోవడం ఏమిటని వారు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 

రైతుల సంక్షేమం వద్దా?: సబిత

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన సాగిస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆమె  ఖండించారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై ప్రశ్నించడం, బాధితులకు అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఒకపక్క రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యుత్ కొరత, సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతుంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఈ నిధుల్లో కొంతైనా రైతుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. కరువుతో నష్టపోయిన ప్రతి రైతుకూ తక్షణమే ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడాలని కోరారు.  మూసీ సుందరీకరణ పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను భయాందోళనలకు గురిచేయడం సరికాదన్నారు. బాధితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

సర్కారు నిర్లక్ష్యం: శ్రవణ్

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మూసీ బాధితుల సమావేశానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ శ్రవణ్ ఎల్ నినో పరిస్థితులపై తన ఎక్స్ ఖాతాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎల్ నినో పరిణామాలపై ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. కరువు మండలాలను ప్రకటించడమే కాకుండా ఎల్ నినో కరువు పాలసీని ప్రకటించాలని, నిపుణుల పర్యవేక్షణలో గోదావరి జలాలను ఎత్తిపోయాలని, కరువు సహాయక బడ్జెట్‌ను బహిర్గతం చేసి, రైతులకు కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు. 

ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటారా?

మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకుంటారా? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.   మూసీ లూటిఫికేషన్‌లో లక్షన్నర కోట్ల లూటీని ఆపి, రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇన్‌చార్జి కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఈమేరకు ఆయన బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి గుర్తుచేసిన ముఖ్యమంత్రికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్ గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టిపరిస్థితులో సహించే ప్రసక్తే లేదన్నారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే లక్షన్నర కోట్ల లూటీకి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేయడం సిగ్గుచేటన్నారు. లక్షలాది మంది రైతులు కరువులో నిండా మునిగి కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం మూసీలో మూటలవేట సాగిస్తున్నారని విమర్శించారు.

ఎండిపోయిన పంటలకు ఎకరాకు కనీసం 50 వేల పరిహారం ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారన్నారు. మూసీలో దోపిడీయే తన తొలి ప్రాధాన్యమని చాటిచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూసి 70 లక్షల మంది రైతులు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. మూసీ లూటిఫికేషన్‌తో రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకునే వరకూ బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. అప్రజాస్వామికంగా బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేశారన్నారు.

మరిన్ని వార్తలు