విజయ్ ఆంటోనీ మిర్చి బజ్జీల ప్రమోషన్

24-11-2026 | 05:07pm

హైదరాబాద్: స్టార్ హీరో అంటే ఖరీదైన కార్లు, భారీ భద్రత, ఫైవ్‌స్టార్ హోటళ్లు గుర్తుకొస్తాయి. కానీ తమిళ హీరో విజయ్ ఆంటోనీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన కొత్త సినిమా ‘నాన్న కుట్టి’ (Nanna Kutti) ప్రచారం కోసం సామాన్యుడిలా హైదరాబాద్ వీధుల్లో సందడి చేశారు. స్వయంగా మిర్చి బజ్జీలు (Mirchi Bajji) వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

హీరోయిన్ ప్రీతి ఆస్రానీతో కలిసి అమీర్‌పేట (Ameerpet) వీధుల్లో ప్రత్యక్షమైన విజయ్ ఆంటోనీ.. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా స్థానికులతో కలిసిపోయారు. స్టార్ హీరో తమ మధ్యే ఉండటంతో అభిమానులు, స్థానికులు ఆయనను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు సందడి చేశారు.

బజ్జీల సందడి అనంతరం విజయ్ ఆంటోనీ, ప్రీతి ఆస్రానీ ఓ ఇరానీ కేఫ్‌కు వెళ్లారు. అక్కడ టీ తాగుతూ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. సినిమాల గురించి మాట్లాడటంతో పాటు సాధారణ వ్యక్తిలా వారితో సమయం గడిపారు. ఈ వినూత్న ప్రచార శైలి (Movie Promotion) ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో చెన్నై నుంచి కోయంబత్తూరుకు సాధారణ రైలులో ప్రయాణించి వార్తల్లో నిలిచిన విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమా ప్రచారానికి భారీ ఈవెంట్లే అవసరం లేదని, నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారితో కలిసిపోవచ్చని తనదైన శైలిలో నిరూపిస్తున్నారు.

మరిన్ని వార్తలు