అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్ లాల్
వెంకటాపూర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్ లాల్(BJP leader Jawahar Lal) కోరారు. మండలంలోని నల్లగుంట గ్రామంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పట్టభద్రులను కలుసుకుని, ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
అనంతరం జవహర్ లాల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా పాలన అందిస్తోందని, కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొందని, అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
దేశ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, దేశ ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శోభన్, శ్రీధర్, శరత్, కృష్ణ, సోనా సింగ్, రాజు, రూప్సింగ్, రవి తదితరులు పాల్గొన్నారు.