పశువుల అక్రమ రవాణాకి అడ్డాగా సమ్మక్క బ్యారేజ్ వంతెన

16-09-2026 | 07:50pm

వంతెనపై కొరవడిన నిఘా...?

తుపాకులగూడెం గ్రామంలో షెల్టర్...?

చత్తీస్గడ్ టూ బోర్లగూడెం వయా తుపాకులగూడెం....

పట్టించుకోని అధికారులు...?

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద నిర్మించిన  తుపాకుల బ్యారేజ్ (సమ్మక్క బ్యారేజ్)(Sammakka Barrage Bridge) వంతెన పశువుల అక్రమ రవాణా(Cattle smuggling)కి అడ్డగా మారిపోయింది. బ్యారేజ్ వద్ద నిఘా, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో అక్రమార్కులకు కలిసి వస్తుంది. సమ్మక్క బ్యారేజ్ వద్ద నిఘా పెట్టాల్సిన అధికారులే పశువుల అక్రమ రావణాదారులకు ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన ఓ పశువుల వ్యాపారి కొందరు ప్రైవేట్ వ్యక్తులను ముఠాగా మార్చి చత్తీస్గడ్ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కలియతిరిగి పశువులను బీరమయ్య గుట్ట (సమ్మక్క బ్యారేజ్ ఎగువ గుట్టలు) నుంచి కిందికి కాలి నడకన తీసుసుని వచ్చి వంతెన పైనుంచి తుపాకులగూడెం గ్రామం వద్ద పశువులను కట్టేసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించి తెల్లవారు జామున 3-4 గంటల ప్రాంతంలో గుట్టల గంగారం, దేవాదుల పంప్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బొలెరో వాహనాల్లో కుక్కి కళేబరాలకు తరలిస్తున్నట్టు సమాచారం.

సమ్మక్క బ్యారేజ్ గుండా పశువుల అక్రమ రవాణా వ్యవహారం అంతా కూడా బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉన్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ  రవాణా వ్యవహారానికి కొందరు అధికారులు ముడుపులు తీసుకుని సహకరిస్తున్నట్టు ముఠా సభ్యులు బహాటంగానే చర్చించడం గమనార్హం. జిల్లా అధికారులు స్పందించి సమ్మక్క బ్యారేజ్ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు