బతుకమ్మకు పూలు కరువు..!
- కనుమరుగైన గునుగు, నూకల పూలు
- వాడిపోయిన తంగేడు చెట్లు
- తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మకు పూల కొరత
- బతుకమ్మను తాకిన ఎల్ నినో ప్రభావం
సంస్థాన్ నారాయణపూర్, అక్టోబర్ 15: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా కొలిచే బతుకమ్మ(Bathukamma)కు నేడు పూలు కరువయ్యాయి. తీరొక్క పూలతో బతుకమ్మను కొలిచే తెలంగాణ పల్లెల్లో ఎండిపోయిన కొమ్మలతో మోడువారి దర్శనమిస్తున్నాయి పూలచెట్లు. తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ సంబరాలలో ప్రధానంగా తంగేడు పూలు, గునుగు, మందార, బంతి, చామంతి వంటి ఔషధ గుణాలున్న పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు.
పువ్వులకు పూజలు
సాధారణంగా పూలతో దేవతలను పూజించడం అనవాయితీ కానీ బతుకమ్మలో పూలను పూజించడం ప్రత్యేకం..తొమ్మిది రోజులు పూలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో పూజిస్తారు.
కనుమరుగైన పూలు
బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైన నూకల పువ్వు, తంగేడు పువ్వు, గునుగుపువ్వు నేడు కనుమరుగయ్యింది.వర్షాలు లేక తంగేడు చెట్లు ఎండిపోతున్నాయి. నూకల పువ్వు చూద్దామన్నా కనిపించడం లేదు.
ప్లాస్టిక్ పూల దర్శనం
తీరొక్క పూలతో పూజించే బతుకమ్మను ప్లాస్టిక్ పూలతో అలంకరిస్తున్నారు. పూల కొరతతో తప్పనిసరి పరిస్థితులలో ప్లాస్టిక్ పూలను వాడాల్సి వస్తుందని మహిళలు చెబుతున్నారు.కొంతమంది మహిళలు అందరికంటే తమ బతుకమ్మ భిన్నంగా కనిపించేలా ఉండాలని విభిన్నంగా ప్లాస్టిక్ పూలతో ప్రత్యేక ఆకృతులలో తయారు చేస్తున్నారు.
ధరలకు రెక్కలు
తీవ్ర వర్షాభావంతో పూల కొరత ఏర్పడడంతో మార్కెట్లో లభించే పూల ధరలకు రెక్కలు వచ్చాయి.సాధారణంగా బంతి, చామంతి, మల్లెపూలు,వంటి పూలకు రెట్టింపు ధర చెల్లించినా పూలు దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు మహిళలు.
ఇంతటి పూల కరువు ఎప్పుడూ చూడలేదు
‘బతుకమ్మ పండగకు వారం ముందు నుండే నూక పువ్వు, గునుగు, తంగేడు పువ్వును సేకరించి అమ్మడం ద్వారా తమకు జీవనోపాధి లభించేది .నేడు వర్షాలు లేక పూలు దొరకపోవడంతో ఉపాధి కరువైంది.ఇలాంటి కరువును ఎప్పుడూ చూడలేదు‘.
సావిత్రమ్మ, పూల వ్యాపారి
పూల ధరలు విపరీతంగా పెరిగినయ్..
‘బతుకమ్మను పేర్చడానికి పూలు దొరకకపోవడంతో బంతి పూలు ,చామంతి పూలతోనే బతుకమ్మను తయారు చేయాల్సి వస్తుంది.దీంతో పూల ధరలు విపరీతంగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం‘.
సికిలమెట్ల మాధవి, నారాయణపురం