ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి
- త్రాగునీటికి ప్రథమ ప్రాధాన్యం
- ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
- రామప్ప చెరువులో 29 అడుగుల నీటి నిల్వ
- ఉపాధి హామీతో నీటి సంరక్షణ పనులు
- త్రాగునీటి కొరత లేకుండా చూస్తాం
- మంత్రి సీతక్క
వెంకటాపూర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో(impact of El Niño) ఎండ తీవ్రత పెరిగి, వర్షాలు(Rains) తగ్గే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క(Seetakka) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ నీటి సంరక్షణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
మండలంలోని రామప్ప చెరువు, అక్కడి డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీటి నిల్వ ఉందని, గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాను మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నామని, నీటి నిల్వలు పెంచేందుకు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని, మరో రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు.
రామప్ప చెరువులోని నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీటి సరఫరా వ్యవస్థలు, చెరువులపై ఆధారపడిన గ్రామాలు, భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని, వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనేందుకు రాజకీయ విమర్శల కంటే సమష్టి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని సర్పంచులు, గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఈ పనుల ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం నీటి నిల్వలను పెంచుకోవచ్చని, ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవడంతో పాటు వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకునేలా ప్రజలు చొరవ చూపాలని, సాగునీటి అవసరాలతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రామప్ప, లక్నవరం కాలువ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ నీటి సరఫరా పరిస్థితిని పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. నీటి సంరక్షణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను కాపాడుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.