ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి ఎంతో గొప్పది
కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): అన్ని వృత్తుల్లో ప్రాణాలు కాపాడే వైద్య వృత్తి(Medical Profession) ఎంతో గొప్పదని జిల్లా కలెక్టర్ కె.హరిత(Collector K Haritha) అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో(Government Medical College) ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థుల వైట్ కోట్ సెర్మనీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యం అంటే కేవలం మందులు ఇవ్వడం, చికిత్స అందించడం మాత్రమే కాదని, రోగులకు ధైర్యం చెప్పి భరోసా కల్పించడం కూడా వైద్యుల బాధ్యత అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి వైద్య విద్యలో ప్రవేశం పొందడం గొప్ప విషయమన్నారు. వైద్య విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిబద్ధతతో విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని సూచించారు.తన తండ్రి కూడా వైద్య వృత్తిలో ఉన్నప్పుడు రోగుల పట్ల ఎంతో ఓర్పుతో వ్యవహరించేవారని, ఆయన మరణించిన తర్వాత కూడా ప్రజలు ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు.
వైద్యులు మాట్లాడే మాటలు, చూపించే ఆప్యాయత, ప్రవర్తన రోగుల్లో ధైర్యాన్ని నింపుతాయని చెప్పారు. వైద్య విద్యార్థులు ప్రొఫెసర్లు బోధించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్చుకొని, భవిష్యత్తులో నైపుణ్యం, సేవాభావం కలిగిన వైద్యులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకట్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.