గుట్టలు గయాబ్
నాయకుల కనుసన్నల్లో యంత్రాలు
బిజినేపల్లి, నవంబర్ 02 : జేసిబిలు, ప్రాక్లేయిన్లు, టిప్పరు వాహనాలతో కొందరు అక్రమార్కులు లాభాలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం భూముల్లోని(Government land) గుట్టలను గయాబ్ చేస్తున్నారు. ఈ యంత్రాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడవడానికి వారు అధికారంలో ఉన్న నాయకులను ఆశ్రయిస్తే, అక్రమార్కులు సొంత లాభం కొంత మానుకొని గుట్టలు చదును చేస్తున్నారు. బిజినేపల్లి మండలంలోని వట్టేం జలాశయానికి అనుకోని ఉన్న గుట్ట కాసుల పంటగా మారింది.
గుట్టకు అనుకోని ఉన్న పొలాల రైతులకు ప్రభుత్వ భూమి ఖబ్జా ఆశ చూపి వాటిని చదును చేసి పొలాలుగా మారుస్తున్నారు. దీంతో రైతుల జేబుకు చిల్లు, అక్రమార్కుడికి త్రిల్లు అన్న చందంగా మారింది. ఉమ్మడి లట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ గుట్టలకు అనుకోని ఉన్న పొలాల్లో రాళ్ళు కొడుతూ, పొలాలు చదును చేస్తున్నారు. ఖబ్జాల కోసం కొందరు ప్రత్యేకంగా వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో రెచ్చిపోతుంటే పట్టించుకునే వారే లేరా అని ప్రజలు అంటున్నారు.