డంపింగ్ యార్డ్ సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహించండి

02-11-2026 | 08:07pm
  1. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కార్యాచరణ.           
  2. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశం.                                

జవహర్ నగర్, నవంబర్ 2 (విజయక్రాంతి): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) సమస్యపై వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై పలు పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు నిరసన తీవ్రమవుతున్న తరుణంలో సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై మహేష్ కుమార్ గౌడ్ తో వజ్రేష్ యాదవ్ చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్య తీవ్రత చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఈనెల మూడవ తేదీన ఉదయం 11 గంటలకు నాగారంలోని ఎం.వి.ఆర్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు.

ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులు డంపింగ్ యార్డ్ సమస్యపై పోరాడుతున్న నాయకులు ప్రజలు మద్దతుదారులు హాజరై తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేసి సమస్య పరిష్కారానికి సహకరించాలని తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోటేష్ గౌడ్, మనోధర్ రెడ్డి, నాయకం భాస్కర్, బల్లి శ్రీనివాస్ గుప్తా, మాట్ల వినయ్, సత్యం, కిరణ్, జవహర్ నగర్ కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు