పట్టభద్రులకు మరో ఛాన్స్.!
- ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు
- జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్.
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ (MLC constituency) ఓటరు జాబితా (Electoral roll) పునఃతయారీలో భాగంగా అర్హులైన పట్టభద్రుల కోసం ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
నవంబర్ 28, 29 తేదీల్లో మొదటి విడత, డిసెంబర్ 5, 6 తేదీల్లో రెండో విడత శిబిరాలు జిల్లాలోని గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులు ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని, పేరు లేకుంటే ఫారం-18 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.
జాబితాలో తప్పులు, మార్పులు ఉంటే ఫారం-7, ఫారం-8 ద్వారా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చన్నారు. వీటి స్వీకరణకు డిసెంబర్ 10 చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.