జుట్టు వేసుకోలేదని విద్యార్థినిపై టీచర్ దాడి
కరెంట్ పైపుతో కొట్టారని తల్లిదండ్రుల ఆరోపణ.. చేతి ఎముక విరిగినట్లు వెల్లడి
పెంట్లవెల్లి,(విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కేజీబీవీ) విద్యార్థిని(KGBV Student )పై ఉపాధ్యాయురాలు దాడి చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జుట్టు వేసుకోలేదనే కారణంతో తరగతి గదిలోనే కరెంట్ పైపుతో కొట్టినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన రవి కుమార్తె ప్రమీల స్థానిక కేజీబీవీ(KGBV)లో 8వ తరగతి చదువుతోంది. సోమవారం తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి ఉన్న సమయంలో జుట్టు ఎందుకు వేసుకోలేదని ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు మంజుల ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం కరెంట్ పైపుతో విద్యార్థినిని కొట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని విద్యార్థినిని పెంట్లవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఎక్స్రే తీయగా ఎడమ చేతికి తీవ్ర గాయమైందని, ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం విద్యార్థిని చేతిని పైకి ఎత్తలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, విద్యార్థినిని తాను కరెంట్ పైపుతో కొట్టలేదని ఉపాధ్యాయురాలు మంజుల చెప్పినట్లు సమాచారం. మెట్లపై నుంచి జారిపడటం వల్లే చేతికి గాయమైందని ఆమె వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి బయట ఎవరికీ చెప్పవద్దని, వైద్య ఖర్చులు తానే భరిస్తానని ఉపాధ్యాయురాలు వద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సదరు ఉపాధ్యాయురాలు తరచూ విద్యార్థులను కొడుతుంటారని, ఈ విషయాలను బయటకు చెప్పవద్దంటూ తమను భయపెడుతున్నారని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పటేల్ వెంటనే స్పందించి విచారణ జరిపించాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు కోరుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.