కేటీఆర్ సభ విజయవంతంతో కాంగ్రెస్లో వణుకు
హనుమకొండ, నవంబర్ 25 (విజయ క్రాంతి): హనుమకొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, అనవసర వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని స్థాపించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి బెదిరింపులకు భయపడబోరని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకత్వం, ఉద్యమకారులకు అండగా నిలిచి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేసిన కేటీఆర్ తదితరులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత ఉద్యమంతో సాధించిన తాము ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోమని తెలిపారు. దాడులు, అక్రమ కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. పోలీసు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా (Impartial) వ్యవహరించాలని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని బాధిత కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల వ్యవహారశైలిలో మార్పు రాకపోతే చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, పోలీసుల ద్వారా అక్రమ కేసులు నమోదు చేయించడం సరికాదన్నారు. సుమారు 200 మంది కార్యకర్తలను నాలుగైదు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వరంగల్ నగరంలో రాయలసీమ రౌడీ సంస్కృతికి తావులేదని, రాజకీయాల్లో హింసకు బదులుగా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఇమ్మడి రాజు, దాస్యం విజయ్ భాస్కర్, కుసుమ లక్ష్మీనారాయణ, ఉడతల సారంగపాణి, వద్దిరాజ్ గణేష్, సోదా కిరణ్, జోరిక రమేష్, సంకు నర్సింగ్ రావు, మేకల బాబురావు, నాయకులు పులి రజినీకాంత్, నయీమొద్దీన్, రామ్మూర్తి, నార్లగిరి రమేష్, దర్శన్ సింగ్, పుష్ప, ఎస్కే మహమూద్, వేణుగోపాల్, వీరస్వామి, అనిల్, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.