హ్యాండ్లూమ్ హౌస్‌ బోర్డులో తెలంగాణకు తొలిస్థానం..

27-10-2026 | 07:05pm
  1. డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక
  2. ఏడు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం
  3. గట్టుప్పల్‌ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలికి అరుదైన అవకాశం

మునుగోడు, అక్టోబర్ 27(విజయక్రాంతి): జాతీయ చేనేత రంగంలో(National Handloom Sector) తెలంగాణకు అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించే ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ ఫ్యాబ్రిక్స్‌ మార్కెటింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (హ్యాండ్లూమ్‌ హౌస్‌) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో రాష్ట్రానికి తొలిసారిగా ప్రాతినిధ్యం లభించింది.

నల్గొండ జిల్లా గట్టుప్పల్‌  మండలం చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుమారు ఏడు దశాబ్దాల సంస్థ ప్రస్థానంలో తెలంగాణకు ఈ అవకాశం దక్కడం విశేషం.చేనేత కళాకారుల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో పద్మశ్రీ మచాని సోమప్ప 1955లో హ్యాండ్లూమ్‌ హౌస్‌ను స్థాపించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ఇంతకాలం తెలంగాణకు బోర్డు స్థాయిలో ప్రాతినిధ్యం లభించలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వజ్రమ్మ ఎన్నిక రాష్ట్ర చేనేత రంగానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

బోర్డు డైరెక్టర్‌గా ఎన్నికయ్యేందుకు అవసరమైన జనరల్‌ బాడీ సభ్యత్వాన్ని వజ్రమ్మ తొలుత సాధించారు. అనంతరం వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మద్దతు కూడగట్టారు. ఆమె భర్త, ఆప్కో మాజీ డైరెక్టర్‌ కర్నాటి వెంకటేశం సహకార రంగంలో పొందిన అనుభవం, పరిచయాలు ఈ ప్రయాణంలో తోడ్పడ్డాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేరళ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన సభ్యుల మద్దతుతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్‌ ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. హ్యాండ్లూమ్‌ హౌస్‌ బోర్డులో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభించడంతో చేనేత సంఘాల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించేందుకు అవకాశం ఏర్పడింది.

సంస్థ షోరూమ్‌లలో తెలంగాణ ఉత్పత్తులకు ప్రాధాన్యం కల్పించడం, జాతీయ ప్రదర్శనల్లో భాగస్వామ్యం పెంచడం, సహకార సంఘాలను కొనుగోలు వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా కళాకారులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

చేనేత ఉత్పత్తుల విక్రయాలు, గిట్టుబాటు ధరలు, ముడిసరుకుల వ్యయం, నిల్వల్లో పేరుకుపోతున్న వస్త్రాల సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో లభించిన ఈ ప్రాతినిధ్యాన్ని కళాకారులకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చేలా వినియోగించుకుంటే తెలంగాణ చేనేత రంగానికి మేలు జరిగే అవకాశం ఉంది.

వజ్రమ్మ ఎన్నికపై ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పద్మశాలి, చేనేత సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు. గ్రామీణ సహకార సంఘం నుంచి జాతీయ స్థాయి సంస్థ బోర్డు వరకు ఆమె ఎదిగిన తీరు మహిళా నాయకత్వానికి గుర్తింపుగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు