ఆధునిక సాగుతోనే అన్నదాత అభ్యున్నతి
- రాష్ట్రానికి ఆదర్శంగా కట్టంగూర్ ఎఫ్‌పీవో
- వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీసీ కే సురేంద్ర మోహన్
కట్టంగూర్ అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార శుద్ధి, రైతులకు అవసరమైన సేవలను ఒకే వేదికపై అందించడం ద్వారా అన్నదాతల అభ్యున్నతి సాధ్యమని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ కె. సురేంద్రమోహన్(Commissioner for Agricultural Products K. Surendramohan) అన్నారు.
ఆదివారం గంగాదేవిగూడెంలోని కట్టంగూర్ ఎఫ్‌పీవోను సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఆయిల్‌పామ్ కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ప్రారంభించి, సంస్థలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. బయోచార్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. స్వచ్ఛ శక్తి బ్యాటరీ వ్యవస్థను ప్రారంభించారు.
సహకార శాఖ, నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్డీసీసీబీ) సహకారంతో పది మంది మహిళలకు బ్యాటరీ వాహనాలను పంపిణీ చేశారు. కట్టంగూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ) రాష్ట్రంలోని ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.
రాష్ట్రంలో ఒక ఎఫ్పీఓను అత్యుత్తమ కేంద్రంగా (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) తీర్చిదిద్దే ఆలోచన ఉందని, భవిష్యత్తులో కట్టంగూర్ ఎఫ్పీఓను ఆ స్థాయికి తీసుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కట్టంగూర్ సంస్థ అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, నాబార్డు నల్లగొండ డీజీఎం ఎం. వినయ్ కుమార్, కట్టంగూర్ ఎఫ్పీఓ చైర్మన్ చౌగోని సైదమ్మ, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, ఉద్యాన అధికారి టి. శేఖర్, సహకార అధికారి షాలిని, కట్టంగూర్ తహసీల్దార్ పుష్పలత,
నల్లగొండ సహకార బ్యాంకు సీఈఓ ఆర్. శంకర్ రావు, కట్టంగూర్ ఎఫ్పీఓ మెంటర్, తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం అధ్యక్షుడు రావుల విద్యాసాగర్, పిండిప్రోలు వెంకట్,ఉద్యాన అధికారులు శ్వేత, ప్రవీణ్ కుమార్, మురళి, రిషిత, రవి నాయక్, నకిరేకల్ వ్యవసాయ డివిజన్ ఏడీఏ విజయేందర్ రెడ్డి, కట్టంగూర్ వ్యవసాయ అధికారి గిరిబాబు, కట్టంగూర్ ఎఫ్పీఓ సీఈఓ జె. రమేష్, రైతులు పాల్గొన్నారు.