కెనడా మేయర్ రేసులో తెలంగాణ బిడ్డ
- బాలీవుడ్ పాటలతో ప్రచారంలో దూసుకుపోతున్న దీపికా దామెర్ల
- సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్
ఒట్టావా, అక్టోబర్ 10: భారతీయ సంతతికి చెందిన కెనడా ఎన్నికల్లో మిస్సిస్సాగా(Mississauga in the Canadian elections) మేయర్‌గా పోటీ చేస్తున్న దీపికా దామెర్ల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వినూత్న శైలిలో భారతీయ పాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ప్రచార శైలిని కాస్తా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు షేర్ చేయగా అవికాస్త వైరల్‌గా మారాయి. తాజాగా ఆ వీడియోలు హల్‌చల్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
కెనడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న దీపికా దామెర్లతో కొనసాగిన ఓ డిబేట్ అనంతరం ఉపశమనం కోసం వీడియోను షేర్ చేశారు. వీడియోలో ‘క్యా హువా తేదా వాదా’ అనే పాటను ‘ఏ రహా మేరా వాదా’ అంటూ పాడుతూ పాట మాధ్యమంగా తాను మిస్సిస్సాగా మేయర్ అయిన రోజు నుంచి ఆస్తి పన్నులు పెరగవని అన్నారు. గతంలో న్యూయార్క్ మేయర్ జోరాన్ మమ్దానీ కూడా ఇదే రీతిలో ప్రయాణం చేసి మేయర్ ఎన్నికల్లో విజయం సాధించారు.
తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించిన దీపికా దామెర్ల తండ్రి ఆర్మీలో పనిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక 1991లో కెనడాకు వెళ్లి టొరంటో విశ్వవిద్యాలయంలోని రొట్మాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ బ్యాంకులలో, టీవీ జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మిస్సిస్సాగాలోని 2018లో ఏడో వార్డుకు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అంటారియో ఆరోగ్య, దీర్ఘకాలిక సంరక్షణ సహాయ మంత్రిగా, వయోవృద్ధుల వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. మొత్తానికి తెలంగాణకు చెందిన తెలుగు మహిళ దీపికా దామెర్ల మేయర్‌గా ఎన్నిక కావాలని నెటీజన్లు ఆకాంక్షిస్తున్నారు.