ఆడబిడ్డల భవితకు భరోసా ఏదీ?

11-10-2026 | 05:25am

నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం(International Day of the Girl Child)

ప్రపంచ జనాభాలో(World population) దాదాపు సగం మంది మహిళలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ప్రతీ 101 మంది పురుషులకు 100 మంది మహిళలు ఉన్నారు. మనదేశంలో 715 మిలియన్ల మహిళలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా జనాభా ఉన్న దేశాలు మోల్డోవా, లుథివియా, రష్యా. నగరం జపాన్‌లోని టోక్యో. అయితే పురుషులతో పోలిస్తే సమానత్వం, హక్కులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, లింగ అసమానతలు వంటి అంశాల్లో మహిళల పరిస్థితి నేటికీ ఆందోళనకరంగానే ఉంది.

మహిళలు, బాలికలపై దాడులు, హింసలు, కిడ్నాప్‌లు నిత్యకృత్యంగా మారాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా మహిళలపై వివక్షత, చిన్న చూపు కనపడుతున్నది. ముఖ్యంగా భారత్‌లో మహిళలు అంటే మహాలక్ష్మితో పోలుస్తారు. కానీ, వారికి ఇస్తున్న ప్రాధాన్యతలో చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది.

ఎక్కడ చూసినా మగవారి ఆధిపత్యమే. దీనిలో భాగంగానే అమెరికా పౌర హక్కుల నేత ‘ఎలనార్ రూజ్ వెల్ట్’(Eleanor Roosevelt) మహిళల హక్కుల కోసం పోరాటం చేసి, సమానత్వంలో భాగంగా ‘మ్యాన్’అనే మాటకు బదులుగా ‘పీపుల్’ అనే పదం వాడుకలోకి తీసుకువచ్చారు. దీంతో ప్రతీ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ప్రపంచ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ‘కెనడాలోని ‘ప్లాన్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ రూపొందించిన ‘ఐ యామ్ ఏ గర్ల్’

అనే క్యాంఫైన్ ప్రతిఫలమే అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకోవడానికి పునాది అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పరిస్థితులు, సమస్యల పరిష్కారం కోసం “ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ’ 66/170 తీర్మానం ఆమోదం చేసి, ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరపాలని నిర్ణయించాయి. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం ‘ఎండ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ గర్ల్ రైట్స్’ అనే థీమ్‌తో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 

మహిళలు, బాలికలు నేటికీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాలు, లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అన్యాయాలు, వివక్షతలు, అవిద్య, అనారోగ్యం కనీసం హక్కులు, రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ‘యునెస్కో’ గణాంకాలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం (18 ఏళ్ల లోపే) జరుగుతుంది. ప్రపంచంలో 680 మిలియన్ల మందికి బాల్యవివాహాలు జరిగాయి.

నేటికీ ఏటా 12 మిలియన్ల మంది బాలికలకు పసిప్రాయంలోనే వివాహాలు జరుగుతున్నాయి. బాల్యవివాహం జరిగిన ప్రతీ నలుగురిలో ఒకరు హింసకు గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అత్యధికంగా 31% శాతం బాల్యవివాహాలు సబ్ సహారా దేశాల్లో జరుగుతున్నాయి.   

సమానత్వం మాటల్లోనే.. సవాళ్లు ఎన్నో?

ఐక్యరాజ్యసమితి తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 17వ లక్ష్యంగా ‘ లింగ సమానత్వం, స్త్రీలు స్వయం సమృద్ధి సాధించడం, సమాన హక్కులు, ఆర్థిక స్వావలంబన’ 2030 నాటికి సాధించాలని నిర్ణయించి, తదనుగుణంగా చర్యలు చేపట్టింది.  తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నేటికీ 133 మిలియన్ల బాలికలు విద్యకు దూరంగా ఉన్నారు. ప్రతీ 10 మందిలో నలుగురు కనీసం అప్పర్ ప్రైమరీ స్కూల్ చదవడం లేదు.

దాదాపు మూడో వంతు 15 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలికలు భర్తల చేతిలో హింసకు గురవుతున్నారని తెలుస్తోంది. ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైం (.యన్‌ఓడీసీ) నివేదికలు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భర్త బాధితులే ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించింది. ‘ఓహెచ్‌సిహెచ్‌ఆర్’ సంస్థ రూపొందించిన లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్, సెక్సువల్ హెరాస్మెంట్, వివక్షత వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఎక్కువగా బాలికలు, మహిళలే అని పేర్కొంది.

ఇక మనదేశంలో ప్రతీ రోజు 88 మంది లైంగికదాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా 2015  మధ్య కాలంలో భారత్‌లో యన్‌సీఆర్‌బీ నివేదికల ప్రకారం మైనర్ బాలికలపై లైంగికదాడులు, హింస పెరిగిపోయింది. అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో 97% శాతం తెలిసిన వారు, కుటుంబ సభ్యులే ఉండటం గమనార్హం. 18 సంవత్సరాల లోపు లైంగికదాడులకు గురైన బాలికల సంఖ్య 2015లో 10, 934 మంది ఉండగా, 2024 నాటికి 43, 675కి పెరిగిపోయింది.  

ఐదేళ్లలో 3 లక్షలకు పైగా ఫోక్సో కేసులు

2020- మధ్య కాలంలో  పోక్సో కేసులు నమోదయ్యాయి.  అందులో లైంగికదాడులు 1,83,372,  సెక్సువల్ అసాల్ట్ 96,505, సెక్సువల్ హెరాస్మెంట్ 12,807, ఇతర కేసులు 3,037 ఉన్నాయి.  ఐదేళ్ల కాలంలో 3 లక్షల పోక్సో కేసులు నమోదవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇక  ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మిలియన్ల మంది బానిసత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికులు బాలికలు, మహిళలే.

మనదేశంలో 2023లో “కైం అగైన్స్ట్ ఉమెన్’  కింద నమోదైన  కేసులు 4,48,211. ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ బాలికలు మహిళలకు రక్షణలేని ప్రాంతంగా, రేప్ క్యాపిటల్‌గా తరచూ వార్తల్లో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాలు సైతం  తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.    

పాఠశాలల నుంచి పని ప్రదేశాల వరకు..

ఇటీవల కోల్‌కతలో బాలికపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా కలకంరేపింది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో, వసతి గృహాల్లో కూడా బాలికలకు రక్షణ లేని పరిస్థితులున్నాయి.  ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుతున్న బాలికలు గర్భవతులు అవడం ఆందోళన కలిగిస్తోంది. పని ప్రదేశాల్లో మహిళలు, బాలికలకు రక్షణ భద్రత లేని పరిస్థితి.  అంతర్జాతీయ మహిళా రక్షణ భద్రత సూచి 2025- భారత్ 131వ స్థానంలో నిలిచింది.

181 దేశాల్లో మన దేశ ర్యాంకు 131 ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్ పురోగతి సాధిస్తున్నది, జీడీపీ వృద్ధి రేటు పెరిగిందని సంబరం పొందుతున్న పాలకులు.. మహిళలు, బాలికల అభివృద్ధిలో ఎంత వెనుకబడి ఉన్నామో ఇకనైనా గుర్తించాలి.  ‘నారీ’ నివేదికల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 40% మహిళలకు భద్రత లేదు, 29.3% శాతం మంది గృహ హింసకు గురవుతున్నారు. ఏటా 200 నుంచి 300 మంది యాసిడ్ దాడుల బారిన పడుతున్నారు.

దేశంలో వరకట్న నిషేధ చట్టం (1961), రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1) ద్వారా లింగ వివక్షపై నిషేధం, ఆర్టికల్ 39(డి) ద్వారా సమాన పనికి సమాన వేతనం, పోక్సో చట్టం (2012), నిర్భయ చట్టం (2013), బాల్యవివాహాల నిరోధక చట్టం వంటి అనేక రక్షణ చర్యలు అమల్లో ఉన్నాయి.

మహిళా కమిషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, షీ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. అయినా వేధింపులు, లైంగిక దాడులు, వివక్ష కొనసాగుతుండటం ఆందోళనకరం. మద్యం, మాదకద్రవ్యాల వ్యసనాలు, మహిళల పట్ల గౌరవం లేని ధోరణులు హింసకు దారితీస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు, అశ్లీల కంటెంట్, వెబ్‌సైట్లు, యాప్‌ల దుర్వినియోగం, ఆన్‌లైన్ వేధింపులు కూడా బాలికల భద్రతకు సవాళ్లుగా మారుతున్నాయి.  

ప్రభుత్వం, కుటుంబం, సమాజం.. సమష్టి బాధ్యత

బాలికలు, మహిళలకు భద్రత, సమాన హక్కులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించి, ముఖ్యంగా విద్య, వైద్యం, పోషకాహారం, భద్రత రంగాలపై ప్రత్యేక దష్టి పెట్టాలి. పోలీసు వ్యవస్థలో నిఘాను పటిష్టం చేయాలి. అవసరమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచాలి. పాఠశాలలు, కళాశాలలు, వసతి గహాలు, పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలి.

మహిళలు, బాలికలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతం కావాలి.  డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలి.  బాలికల రక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు.. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతోపాటు నైతిక విలువలు, మానవీయ దృక్పథం, లింగ సమానత్వం, పరస్పర గౌరవం వంటి అంశాలను బోధించాలి.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల సమస్యలపై చర్చించడమే కాకుండా, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలి. నేటి బాలికలే రేపటి శావేత్తలు, వ్యాపారవేత్తలు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పౌరులు. వారికి భద్రత, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించినప్పుడే వికసిత భారత్-- లక్ష్యం సాకారమవుతుంది.

మరిన్ని వార్తలు