ఢిల్లీలో ఎమర్జెన్సీ!

11-10-2026 | 05:25am
  1. సీఈసీ జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిరసనలు
  2. అడుగడుగునా నిర్బంధాలు
  3. విమానంలోనే అభిజిత్ దీప్కే అరెస్ట్
  4. మద్దతుగా బయలుదేరిన మమత, కేజ్రీవాల్, విజయన్, మాణిక్ సర్కార్ కూడా..! 
  5. ౭,000 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  6. ఎంత మంది పోలీసులను పంపినా వెనక్కి తగ్గబోం: రాహుల్ గాంధీ
  7. ఇండీ కూటమి ఆధ్వర్యంలో రేపు సీజేఐకి వినతిపత్రం.. భారీ నిరసన

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ(Capital Delhi) అట్టుడికిపోతున్నది. అడుగడుగునా అరెస్టులు.. నిర్బం ధాలు.. ముళ్లకంచెలు.. పోలీసుల మోహరింపు.. ఇంటర్నెట్ బంద్.. ఇలా ఆందోళనలపై ఆంక్షలతో జంతర్ మంతర్(Jantar Mantar) సహా పరిసరాలన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి.  ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న హైటెన్షన్ వాతావరణం(High-tension atmosphere) నెలకొన్నది. ఈ నెల 6న ఇండీ కూటమి ర్యాలీతో మొదలైన నిరసనల హోరు శనివారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)(Cockroach Janata Party) పోరాటంతో మరింత ఉధృతమైంది.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ముందుగా ప్రక టించినట్లు శనివారం ఉదయం జంతర్‌మంతర్‌లో ధర్నాకు సీజేపీ సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రు లు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయ్ విజయన్, మాణిక్ సర్కార్ సహా ప్రతిపక్ష పార్టీలు కూడా ‘కాక్రోచ్’కు మద్దతుగా నిరసనలకు దిగాయి.  అయితే.. శుక్రవారం రాత్రే జంతర్‌మంతర్ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

శనివారం నిరసన తెలిపేందుకు ముంబై నుంచి విమానంలో బయలుదేరిన సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే, ఆయన అనుచరులను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానంలోనే అరెస్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితులు ఇందిరాగాంధీ హయాంలో కూడా లేవని.. ఎమర్జెన్సీని మించి మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నదని దీప్కే మండిపడ్డారు. బస్టాండ్‌లో ధర్నాకు దిగిన మమతా బెనర్జీని, ర్యాలీగా బయలుదేరిన అర్వింద్ కేజ్రీవాల్‌ను, మద్దతు తెలిపేందుకు వచ్చిన పినరయ్ విజయన్, మాణిక్ సర్కార్ సహా దాదాపు మూడువేల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుల సందర్భంగా తీవ్ర తోపులాట జరిగింది. 

విమానం దిగకముందే..!

కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేతోపాటు ఆ పార్టీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తదితరులు జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. హస్తినలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఐబీ, సీఐఎస్‌ఎఫ్, ఢిల్లీ పోలీసులు విమానంలోకి వెళ్లారు. ముఖ్యంగా మహిళా పోలీసులు ముందుండి..

దీప్కే సహా సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ‘విమానంలో నుంచి దిగకముందే అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు చూడండీ. రండి మేడమ్.. రండి! అరెస్ట్ చేయండి. మేం భయపడం. ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇలాంటి నిర్బంధాలు ఈ దేశం చూడలేదు. కానీ, ఇప్పుడు ఎమర్జెన్సీని మించి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెనక్కి తగ్గబోం. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు, సర్‌ను రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు’ అంటూ విమానంలోనే మీడియాతో దీప్కే మాట్లాడుతూ కనిపించారు.

ఈ వీడియోను సీజేపీ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. అరెస్టును ముందే ఊహించిన అభిజిత్ దీప్కే ముంబై నుంచి బయలుదేరేటప్పుడే ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘నన్ను, మా మిత్రులను పోలీసులు అరెస్ట్ చేసినా.. ఎవరూ వెనక్కి తగ్గొద్దు. శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలపాలని కోరుతున్న. ప్రజల ఆస్తులకు గానీ, ప్రభుత్వ ఆస్తులకు గానీ ఎలాంటి నష్టం కలిగించకుండా నిరసనను కొనసాగిద్దాం’ అని పిలుపునిచ్చారు.

యువతను చూసి కేంద్ర ప్రభుత్వం ఎంత భయపడుతున్నదో ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నదని ఆయన అన్నారు. ఢిల్లీ ఏమైనా మోదీ, అమిత్ షా ప్రైవేట్ ఆస్తులా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, అభిజిత్ దీప్కే, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించారు. 

దీదీ, కేజ్రీ, విజయన్, మాణిక్ సహా..

సీజేపీ నిరసనలకు మద్దతుగా ఢిల్లీ జంతర్ మంతర్‌కు ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజా సంఘాల నాయకులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా బయలుదేరగా.. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశాను. నిర్బంధంలోకి తీసుకున్నారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ(దీదీ) తన పార్టీ నేతలతో కలిసి సౌత్ అవెన్యూలోని ఓ బస్టాండ్‌లో ధర్నాకు దిగారు.

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని, ఆయన రాజీనామా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. మమతతోపాటు టీఎంసీ నేతలు డెరెక్ ఓబ్రియన్, డోలా సేన్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి.. ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమను పోలీసులు కిడ్నాప్ చేశారని, ఇక్కడి నుంచి కదలబోమంటూ ఠాణాలోనే దీదీ ధర్నాకు దిగారు. ఇక, ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లో తెల్లవారుజామునే పోలీసులు భారీగా మోహరించారు.

జంతర్ మంతర్‌కు అనుచరులతో ఆయన బయలుదేరేందుకు సిద్ధమవగా   అరెస్ట్ చేశారు. విమానంలోనే కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులను అరెస్ట్ చేయడమంటేనే మోదీ ఎంత భయపడుతున్నారో అర్థమవుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని, వారికి తామంతా మద్దతిస్తామని తెలిపారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీని గురుగ్రామ్‌లోని నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు.

అనంతరం అరెస్ట్ చేశారు. కేరళం మాజీ సీఎం పినరయ్ విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా సీజేపీకి మద్దతుగా జంతర్ మంతర్‌కు ర్యాలీగా బయలుదేరిన పలువురు సుప్రీంకోర్టు లాయర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, ముంబై సహా ఇతర ఏరియాల్లోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. ముంబైలో నిరసనకు దిగిన నటుడు ఇమ్రాన్ ఖాన్, యాక్టివిస్ట్ తుషార్ గాంధీ సహా 400 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

నేడు కూడా సీజేపీ భారీ ఆందోళనలు

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా, సీజేపీ పోరాటానికి మద్దతుగా ఢిల్లీలో నిరసన తెలిపేందుకు వచ్చినవారిలో దాదాపు ౭వేల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ వైపు ఎవరు వెళ్లినా.. అదుపులోకి తీసుకున్నారు. మద్దతుగా ఎక్కడ నిరసనలు జరిగినా అడ్డుకున్నారు.  కాగా, అరెస్టు చేసినవాళ్లలో చాలా మందిని రాత్రి పోలీసులు విడుదల చేసినప్పటికీ ఇంకా సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సహా పలువురిని  రిలీజ్ చేయలేదు. దీంతో ఆదివారం  భారీ ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చింది.  

‘జానీ జానీ ఎస్ పాపా.. జ్ఞానేశ్‌కుమార్ నో పాపా’

సెటైరికల్ పాట పాడిన మమత 

జంతర్ మంతర్‌లో నిరసనకు బయలుదేరే ముందు టీఎంసీ చీఫ్, బెంగాల్ మాజీ సీఎం మమతాబెనర్జీ ఓ సెటైరికల్ పాట పాడారు. ‘జానీ జానీ ఎస్ పాపా, జ్ఞానేశ్‌కుమార్ నో పాపా.. జానీ జానీ ఎస్ పాపా, జ్ఞానేశ్‌కుమార్ అరెస్ట్ పాపా.. జానీ జానీ ఎస్ పాపా, మోదీ సర్కార్ నో పాపా..’ అంటూ పాట రూపంలో విమర్శలు గుప్పించారు. ఓట్ల చోరీకి మోదీ సర్కార్ పాల్పడుతున్నదని, ఇందుకు జ్ఞానేశ్‌కుమార్ సహకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. జ్ఞానేశ్ రాజీనామా చేయాల్సిందేనని మమత డిమాండ్ చేశారు. 


మరిన్ని వార్తలు