పోలీసులపైనే కత్తి దాడి.. కాళ్లలోకి ఆరు బుల్లెట్లు

24-11-2026 | 08:55am

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జామా మసీదు పోలీస్ స్టేషన్‌(Delhi Jama Masjid Police Station)లో కత్తి దాడి కలకలం రేపింది. కుటుంబ వివాదంపై విచారణకు పిలిచిన ఓ యువకుడు పోలీసులపైనే కత్తి(Knife)తో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీకి చెందిన నబీల్ (30) తన తల్లి, సోదరిని వేధిస్తున్నాడనే ఫిర్యాదుతో పోలీసులు కౌన్సెలింగ్ కోసం స్టేషన్‌కు పిలిచారు.

సోమవారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన అతడు ఒక్కసారిగా జేబులోని కత్తి తీసి పోలీసులపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన నబీల్.. మార్గమధ్యంలో ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నాడు. అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చిట్లీ ఖబర్ ప్రాంతంలో గుర్తించారు.

పట్టుకునేందుకు ప్రయత్నించగా మరోసారి పోలీసులపై కత్తితో దాడి(Knife Attack) చేయడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగారు. మొత్తం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరపగా.. ఆరు బుల్లెట్లు నబీల్ కాళ్లకు తగిలాయి. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పోలీసులకు కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు