కలిసిమెలిసి ముందుకెళ్లాలి
- పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి
- కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బీఎం సందీప్
- తెలంగాణలో పార్టీ పరిస్థితి, అంతర్గత విభేదాలపై ఆరా
- మంత్రులు, సీనియర్ నేతలతో వేర్వేరుగా సమావేశం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : నాయకులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ బీఎం సందీప్(BM Sandeep) పార్టీ నేతలకు సూచించారు. విభేదాలు లేకుండా అంతా కలిసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మంత్రులు, పలువురు సీనియర్ నాయకులతో(Senior leaders) గాంధీభవన్‌లో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకుల మధ్య విభేదాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పథకాలపై(Government schemes) ప్రజల్లో ఉన్న అభిప్రాయంతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పరిస్థితిపై సందీప్ ఆరా తీశారు.
ప్రభుత్వ నామినేటెడ్(Government-nominated), పార్టీ పోస్టుల అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. గత కొంత కాలంగా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్న నాయకుల గురించి కూడా తెలుసుకున్నట్లు సమాచారం. అధిష్ఠానం నిర్ణయాలను, కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రులు, సీనియర్ నేతలకు సూచించారు. ఎన్నికలకు ఇంకా రెండేండ్ల సమయమే ఉన్నదని, ప్రభుత్వం పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపేలా కార్యాచరణ రూపొందించాలని సూచించినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
సమావేశం అనంతరం సందీప్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వం, పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా పనిచేస్తున్నాయని, ప్రజలందరూ పథకాలను స్వాగతించారని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పార్టీని మరితం బలోపేతం చేయడం, ఎన్నికల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. పార్టీలో అంతా సఖ్యంగానే ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ- కుట్రలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. గత ఇన్చార్జి మీనాక్షినటరాన్ చాలా కాలం పాటు ఇక్కడ పనిచేశారని గుర్తు చేశారు.
ఓబీసీ సభ నిర్వహించాలి : వీహెచ్
జనగణనలో ఓబీసీ కాలం చేర్చే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) చేస్తున్న పోరాటానికి ఓబీసీలు అండగా నిలుస్తారని ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు పేర్కొన్నారు. పార్టీ స్టేట్ ఇన్చార్జ్ సందీప్‌తో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితిని వివరించారు. రాహుల్‌గాంధీ సూచన మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. రాష్ట్రంలో ఓబీసీ సభ నిర్వహిస్తే బాగుంటుందని సందీప్‌కు సూచించినట్లు చెప్పారు.