జల సమాధి!
కేసీఆర్, హరీశ్ నిర్వాకం వల్లే రాష్ట్ర నీటి హక్కులు..
చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు దుష్ప్రచారాలా?: సీఎం రేవంత్‌రెడ్డి
మామాఅల్లుళ్లు కృష్ణా నీళ్లను ఏపీకి అప్పనంగా అప్పగించారు
- వైఎస్సార్ హయాంలో మంత్రిగా పోతిరెడ్డిపాడుకు ఓకే చెప్పింది హరీశే
- ఆయనకు కేసీఆర్ గురువు కాదు.. రాజశేఖర్‌రెడ్డి అసలైన గురువు
- జగన్‌కు ప్రగతిభవన్‌లో విందు ఇచ్చి తల ఊపింది కేసీఆరే
- రాష్ట్రానికి 299 టీఎంసీలు చాలు అని సంతకాలు పెట్టి మరణశాసనం రాసిండు
- ఆయన అవినీతిని గుర్తించి.. ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా తీరుమారడం లేదు
- మళ్లీ సంపదను కొల్లగొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారని ఆగ్రహం
- ఏపీ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటామని వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ నీటి హక్కులను(Telangana water rights) జలసమాధి చేసింది ముమ్మాటికీ కేసీఆర్, హరీశ్‌రావు(KCR, Harish Rao) మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మండిపడ్డారు. వాళ్లిద్దరికీ ఉరేసినా, కోదండం వేసి కొట్టినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడటానికి తాము శాయశక్తులా నిరంతరం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘పల్నాడు వాటర్ గ్రిడ్ అంశంపై(Palnadu Water Grid issue) బీఆర్‌ఎస్ దుష్ప్రచారానికి దిగుతున్నది. వాళ్ల హయాంలోనే జగన్ ఆ ప్రాజెక్టును చేపట్టారు.
దానిపై నాడు కేసీఆర్ ఒక్కసారి కూడా నోరుమెదపలేదు. వాళ్ల తప్పులను అన్ని ఆధారాలతో ఎండగడుతాం. కృష్ణా నీళ్లను ఏపీకి అప్పనంగా అప్పగించిందీ వాళ్ల్లే.. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నదీ వాళ్లే’ అని దుయ్యబట్టారు. సోమవారం ఎంసీహెచ్‌ఆర్డీ సెంటర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్ రాజనరసింహతో కలిసి మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
జగన్ జీవో ఇచ్చినప్పుడు ఏం చేశారు?
2004 నుంచి 2006 వరకు వైఎస్సార్ మంత్రివర్గంలో మంత్రులుగా, ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు నీటి హక్కులను శాశ్వతంగా ఆంధ్రాకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పల్నాడు వాటర్ గ్రిడ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేదని ప్రచారం చేస్తున్నారు. దానిని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 2022లోనే జగన్ ప్రారంభించారు. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జలజీవన మిషన్ కింద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తూ జగన్ జీవో ఇచ్చారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌పై కేసీఆర్ ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. కేంద్రం సాయం చేస్తున్నా నోరెత్తలేదు.
2024లోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని జగన్ జీవో ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అంశం తెలియగానే కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు’ అని ఆయన వివరించారు. నాడు కేసీఆర్ అడ్డుకుని ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బరితెగించి నీళ్లు తరలించుకుపోయే అవకాశం ఉండేది కాదన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కారణం కేసీఆరే. ఇప్పుడు టన్నుల కొద్దీ అబద్ధాలను సంచుల్లో వేసుకుని ఊర్లలో కేటీఆర్, హరీశ్‌రావు వెదజల్లివస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
హరీశ్‌కు అసలు గురువు వైఎస్సార్
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం లో హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడుకు అనుమతులు ఇచ్చారని సీఎం రేవంత్ అన్నా రు. ‘ఇదే విషయం మొన్న సిద్దిపేటలో చెప్పాను. దీంతో హరీశ్ స్పందిస్తూ తాను రాజీనామా చేశాక అనుమతులు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. 2005 సెప్టెంబర్‌లో జీవో 170 వచ్చేటప్పటికీ తాను మంత్రిగా లేనంటూ హరీశ్ అంటున్నడు. 2005 మార్చిలో పెట్టిన బడ్జెట్‌లోనే పోతిరెడ్డిపాడుకు నిధులు కేటాయించారు.
క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతే బడ్జెట్‌లో పెడతారు. 2005 బడ్జెట్ ఆమోదం పొందేనాటికి హరీశ్‌రావుతో పాటు ఐదుగురు బీఆర్‌ఎస్ నేతలు మంత్రులుగా ఉండి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. హరీశ్‌రావుకు అసలైన గురువు కేసీఆర్ కాదు.. వైఎస్సార్. వార్డు మెంబర్‌గా కూడా లేని హరీశ్‌రావును మంత్రిగా వైఎస్సార్ చేశా రు. గురుదక్షిణగా పోతిరెడ్డిపాడుకు హరీశ్‌రావు అనుమతులిచ్చారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.
నీటి హక్కులపై కేసీఆర్ మరణశాసనం..
కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టింది బీఆర్‌ఎస్ పార్టీనేనని సీఎం రేవంత్ ఆరోపించారు. రూ.1,250 కోట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపునకు అనుమతులు ఇచ్చారని ఆయన విమర్శించా రు. ‘2005లో కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నారు. 2005లో హరీశ్ మంత్రి కాగానే.. హంద్రీనీవా ద్వారా 40 టీఎంసీల నీటి తరలింపునకు అనుమతిచ్చారు.
వైఎస్సార్ ఏపీకి నీళ్లు తరలించుకుపోతుంటే.. హారతులిచ్చింది హరీశ్‌రావే కదా..? వైఎస్సార్‌కు గురుదక్షిణగా శ్రీశైలం వెనుక నుంచి ఏపీకి పోతిరెడ్డిపాడు లేదా మల్యాల లేదా ముచ్చుమర్రి నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చాడు. 2020లో రాయలసీమ లిప్ట్‌కు అనుమతులు ఇచ్చి తెలంగాణ నీటి హక్కులకు సమాధి కట్టింది కేసీఆర్, హరీశ్‌రావే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
299 టీఎంసీలు చాలు అని సంతకాలు చేసింది కేసీఆరే
‘811 టీఎంసీలు ఉన్న కృష్ణా జలాల్లో పరీవాహక ప్రాంతం ఆధారంగా వాటాలు పంపిణీ జరిగితే తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి. 2015 జూన్ 26న కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఉమాభారతి, తెలంగాణ నుంచి కేసీఆర్, హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు, ఏపీ నుంచి చంద్రబాబునాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
నాటి సమావేశంలోనే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని కేసీఆర్ సంతకాలు చేశారు. నాడు సంతకం చేసి.. రాష్ట్ర నీటి హక్కులపై కేసీఆర్ మరణశాసనం రాశారు’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 2020 జనవరి 29న ఏపీకి శాశ్వతంగా 512 టీఎంసీలు వెళ్లేలా చంద్రబాబుకు సరెండరయ్యారని.. ప్రతిరోజూ 11 టీఎంసీల నీళ్లు ఆంధ్రా తరలించుకుపోవడానికి కేసీఆర్ సంతకాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రాజెక్టులను చట్టబద్ధంగా అడ్డుకుంటాం..
బీఆర్‌ఎస్ ట్రాప్‌లో తాము పడలేదని, 20 ఏండ్ల వివాదానికి తెరదించేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రావాల్సిన నీటిని చట్టబద్ధంగా తీసుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీని రెండుసార్లు కలిశామని చెప్పారు. ‘కేసీఆర్ అవినీతిని గుర్తించి.. ప్రజలు ఆయన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. పదేండ్ల పాలనలో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులకు కేసీఆర్ కేవలం రూ.11,255 కోట్లు ఖర్చు చేశారు.
భూ నిర్వాసితుల కోసం రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మేం మూడేండ్లలో రూ.6,767 కోట్లు ఖర్చు చేశాం. ప్రాజెక్టులు పూర్తికావడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. భూసేకరణపై కేసీఆర్ ఏనాడూ దృష్టి పెట్టలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామాలను తరలించగలరా..? బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే.. చాలా ప్రాజెక్టులు పూర్తయ్యేవి.
ఏ ప్రాజెక్టూ పూర్తి చేయకపోవడం వల్లే ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నది’ అని సీఎం తెలిపారు. 2023 -24లో 208.79 టీఎంసీల కృష్ణా జలాలను ఆంధ్రా తీసుకుంటే తెలంగాణ 119 టీఎంసీలను తీసుకుందని.. 2024- 25లో 285 టీఎంసీలు, 2026లో 268 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకున్నదని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటికే 45.44 శాతం నీళ్లను తెలంగాణ వినియోగించుకున్నదన్నారు.
జగన్‌కు విందు భక్షజనాలు పెట్టి..
‘ఎస్‌ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు-- రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు. రాయలసీమ వైపు ఉన్న ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వం పట్టుపట్టి పూర్తి చేసుకుంది. రూ. 1లక్షా 80 వేల కోట్లను కాంట్రాక్టర్లకు కేసీఆర్ చెల్లించాడు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏపీకి 4.47 టీఎంసీలు రోజుకు తరలించే కెపాసిటీ ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఒక నదిని పూర్తిగా తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కట్టారు.
నాడు రోజమ్మ ఇంట్లో రొయ్యల పులుసు, పంచభక్ష పరమాన్నాలు తిని కేసీఆర్.. తెలంగాణకు అన్యాయం చేశాడు. కేసీఆర్ సీఎం అయ్యాక రాయలసీమలో 8 ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేశారు. ఆయన మాత్రం తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు.. దీని వల్ల పూర్తిగా నష్టపోయాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌ను నాడు ప్రగతి భవన్‌కు కేసీఆర్ పిలిచి విందు భోజనం పెట్టిన తర్వాత రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతి వచ్చిందన్నారు.
గోదావరి నీళ్లను శ్రీశైలం వరకు తీసుకెళ్లడానికి కేసీఆరే ముందుకు వచ్చినట్లు నాడు జగన్ చెప్పారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ‘కేసీఆర్ అవినీతి గుర్తించి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కోల్పోయిన అధికారాన్ని మళ్లీ పొందాలి, మిగిలిపోయిన తెలంగాణ సంపదను ఎలాగైనా కొల్లగొట్టాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. మూడో తరానికి సరిపోయేలా సంపాదించాలని చూస్తున్నాడు’ అని ఆయన ఆరోపించారు.
హరీశ్‌ను ఆయన మామనే నమ్మలేదు..
‘సాగునీటి పారుదల శాఖను అప్పగించాలని హరీశ్‌రావు అంటున్నడు. కానీ, హరీశ్‌ను ఆయన మామనే(కేసీఆరే) నమ్మలేదు.. మేం ఎలా నమ్ముతాం. దొంగనే తాళం అడుగుతున్నట్లు హరీశ్‌రావు తీరు ఉంది’ అని సీఎం రేవంత్ అన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నామని.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ సీఎంల దగ్గరకు వెళ్లి ప్రాజెక్టుల అనుమతుల కోసం కలిశామని చెప్పారు.
‘ప్రధాని మోదీని సాగునీటి ప్రాజెక్టుల వివాదాలపై కలిశాం. సీఆర్ పాటిల్‌ను లెక్కలేనన్ని సార్లు కలిశాం. 512 టీఎంసీల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని ఏపీ స్పష్టంగా చెప్తున్నది. దానికి కారణం కేసీఆర్, హరీశ్‌రావే. ఈ ఒప్పందం తాత్కాలికమని చెప్పడానికి మాకు తల ప్రాణం తోకలోకి వస్తున్నది’ అని సీఎం పేర్కొన్నారు.