నిమ్స్‌లో భారీ అక్రమాలు

24-11-2026 | 05:35am
  1. రూ.25 కోట్ల ఇంప్లాంట్ల నిల్వల్లో అవకతవకలు 
  2. వ్యక్తి మరణించిన 3 నెలల తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు!
  3. ఒకే రోగికి వారం రోజుల్లో 800 గ్లౌజుల వాడకం 
  4. ఏసీబీ తనిఖీల్లో గుర్తించిన అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(Nizam Institute of Medical Sciences) (నిమ్స్) ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు(ACB officials) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీస్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ.25 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీతో పాటు టీజీ సేఫ్ (ఫుడ్ సేఫ్టీ(Food Safety)), డ్రగ్ కంట్రోల్ విభాగం(Drug Control Department), కార్మిక శాఖల ప్రత్యేక బృందాలు సంయుక్తంగా అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీలలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఆసుపత్రి నిర్వహణ, టెండర్లు, మందులు, వైద్య పరికరాల బిల్లింగ్స్‌లో(Medical Equipment Billings) నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కినట్లు ఏసీబీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. 

ఆసుపత్రిలోని ఐదు ఆపరేషన్ థియేటర్లను ఏసీబీ అధికారులు తనిఖీచేయగా,  ఎలాంటి అనుమతులు లేకుండా రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, కన్‌సైన్‌మెంట్ వస్తువులను అల్మరాల్లో నిల్వ చేసినట్టు గుర్తించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మెయిన్ స్టోర్‌కు ఇండెంట్ పెట్టకుండా నేరుగా వెండర్ల నుంచే ఇంప్లాంట్లు తీసుకుని, ఆ తర్వాత బిల్లింగ్ కోసం యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనివల్ల అసలు వాడని ఇంప్లాంట్లకు కూడా బిల్లులు పెట్టి సప్లయర్లతో కుమ్మక్కయ్యే ప్రమాదం ఉందని ఏసీబీ పేర్కొంది. 

వ్యక్తి మరణించిన 3 నెలలకు..

ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగుల విషయంలో భారీ అక్రమాలు జరిగాయి. రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత, కొన్ని సందర్భాల్లో రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కేవలం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే రోగులు డిశ్చార్జ్ అయ్యాక దాదాపు రూ.66 లక్షల విలువైన బిల్లింగ్ ఎంట్రీలు నమోదయ్యాయి. సర్జికల్ వస్తువుల వినియోగంలో విపరీతమైన అవకతవకలు కనిపించాయి. ఒకే రోగికి వారం రోజుల్లో ఏకంగా 800 గ్లౌజులు వాడినట్లు రికార్డుల్లో చూపించారు. ఇలాంటి అక్రమాలు ఎక్కువగా ఆరోగ్యశ్రీ రోగుల ఖాతాల్లోనే జరిగినట్లు తేలింది. 

మ్యాన్‌పవర్, సెక్యూరిటీ టెండర్లలో.. 

2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సర్వీసుల టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేదు. కార్మికుల నియామకాలు, వారిని సెమీ-స్కిల్ కేటగిరీలోకి మార్చడంలో నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు రిక్రూట్‌మెంట్‌లో కుమ్మక్కైనట్లు ఆధారాలు లభించాయి. అలాగే సెక్యూరిటీ సర్వీసుల టెండర్లను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తూ కాంట్రాక్టులను పొడిగిస్తూ వచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారెంటీని కూడా జప్తు చేయలేదు. 

క్యాంటీన్, మెడికల్ షాపుల నిర్లక్ష్యం

ఆసుపత్రి ప్రధాన క్యాంటీన్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తోంది. అక్కడ గడువు తీరిన ఆహార పదార్థాలను గుర్తించారు. క్యాంటీన్ టెండర్లలోనూ బిడ్డర్లు కుమ్మక్కైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇక మెడికల్ షాపుల్లో కనీస విక్రయ రికార్డులు నిర్వహించడం లేదని, రిజిస్టర్ కాని కార్మికులను పనిలో పెట్టుకున్నారని అధికారులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా పలు నోట్ ఫైళ్లు, అగ్రిమెంట్ కాపీలు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, ఆరోపణల నిర్ధారణ కోసం లోతైన విచారణ కొనసాగుతోందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు