అతిపెద్ద ప్రదర్శనగా గ్లోబల్ సమ్మిట్

24-11-2026 | 05:35am

ప్రపంచ స్థాయి విద్యావేత్తలతో ప్రత్యేక చర్చ

వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధుల రాక 

సమ్మిట్‌పై సీఎం సమీక్ష 

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit) -2026 కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ౮0 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ-రంగ ఎక్స్‌పోగా ఈ సమ్మిట్ నిలిచిపోయేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో(MCR HRD) మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu), ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని(India Future City) యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) ప్రాంగణంలో చేపడుతున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని తెలుసుకున్నారు.

సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతి నిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

వెయ్యికి పైగా వివిధ దేశాల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశమున్నందున  సునాయాస ప్రవేశం కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడాలని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతి బింబించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులకు అప్పగించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. డిసెంబర్ 7న ఆరమ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే, ఎయిర్ షో, ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. 

మరిన్ని వార్తలు