ఆధ్యాత్మిక వైభవంగా పుష్కరాలు

24-11-2026 | 05:25am

8 కోట్లమంది భక్తులొస్తారని అంచనా

గోదావరి ఘాట్లు, ఆలయాల అభివృద్ధికి రూ.1,115 కోట్లు

లోగో, నినాదం రూపకల్పనలో ప్రజలకు అవకాశం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సికింద్రాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాలను(Godavari Pushkarala) తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం ప్రపంచానికి చాటేలా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. దేశ విదేశాల నుంచి ఎనిమిది కోట్ల మందికి పైగా భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు(devotees) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్లు, ఆలయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,115 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న పుష్కరాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో పుష్కరాల లోగో, నినాదం రూపకల్పన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాసర, భద్రాచలం, కాళేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బాసరకు రూ.324 కోట్లు, భద్రాచలానికి రూ.276 కోట్లు, కాళేశ్వరానికి రూ.198 కోట్లు కేటాయించినట్లు వివరించారు.

పుష్కరాల పవిత్రత, గోదావరి నది విశిష్టత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా లోగో, నినాదం రూపొందించాలని కోరారు. ఈ పోటీల్లో విద్యార్థులు, కళాకారులు, ప్రజలు వ్యక్తిగతంగా లేదా ముగ్గురు సభ్యులకు మించకుండా బృందాలుగా పాల్గొనవచ్చన్నారు. నవంబర్ 30లోగా లోగో, నినాదాన్ని ఒకే ఎంట్రీగా సమర్పించాలని సూచించారు. విజేతలకు మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతి రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25వేల నగదు అందజేయనున్నట్లు తెలిపారు.

తొలి 100 ఎంట్రీలకు ప్రశంసాపత్రాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల ప్రత్యేకతను విద్యార్థులు తమ కళాత్మక ప్రతిభతో ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు,  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు