జీతాల్లేవ్.. ఒత్తిడి పెరిగింది
స్పైస్‌జెట్‌పై పైలట్ల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్(Airline SpiceJet)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సంస్థలో ఉద్యోగుల జీతాల(Employee salaries) చెల్లింపులు ఆలస్యం కావడం, నిర్వహణ ఖర్చులపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విమాన భద్రత అంశం తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA-India) కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Union Ministry of Civil Aviation)కు లేఖ రాసింది.
పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి జీతాలు సకాలంలో అందకపోవడం వారిలో ఆర్థిక అభద్రత, మానసిక ఒత్తిడికి కారణమవుతోందని సంఘం పేర్కొంది. ఇది విధుల నిర్వహణలో ఏకాగ్రత, అప్రమత్తత, నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు నిర్వహణ సంస్థలు, విడిభాగాల సరఫరాదారులకు చెల్లింపులు నిలిచిపోతే విమానాల నిర్వహణలోనూ ఇబ్బందులు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. విమానాల భద్రత, నిర్వహణ ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసింది.
విమానాల ఆలస్యం, రద్దీలతో ప్రయాణికుల నుంచి వచ్చే ఆగ్రహాన్ని క్షేత్రస్థాయి సిబ్బందే ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు పైలట్లు సంస్థను వీడాలనుకున్నప్పుడు నోటీసు పీరియడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న DGCA.. యాజమాన్యాలు జీతాలు చెల్లించనప్పుడు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించింది. స్పైస్‌జెట్ ఆర్థిక పరిస్థితిపై సమగ్ర పరిశీలన చేపట్టాలని, సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ALPA-India కేంద్రాన్ని కోరింది. సంస్థ ఆర్థిక పరిస్థితి విమాన భద్రతకు ముప్పుగా మారకుండా తక్షణ పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది.