అమెరికాలో ఇనాయిస్ బీభత్సం
- మూడు రాష్ట్రాల్లో 170 కి.మీ. వేగంతో గాలులు
- దెబ్బతిన్న ఇళ్లు, దుకాణాలు, కూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు
- 9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్
- హైఅలర్ట్ ప్రకటించిన గవర్నర్లు,అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, అక్టోబర్ 10: అమెరికా మూడు రాష్ట్రాల్లో ‘ఇనాయిస్’ తుఫాను(Cyclone ‘Inais’) బీభత్సం సృష్టిస్తుంది. శనివారం గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico)తీరాన్ని తాకింది. దీంతో ఫ్లోరిడా, అలబామా, మిసిసిపీ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో గంటకు 170 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను ముప్పు నేపథ్యంలో ఆయా రాష్ట్రాల గవర్నర్లు హై అలర్ట్ విధించారు. తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. 5వేల మంది రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపారు.
భీకర గాలులతో మూడు రాష్ట్రాల్లోని అనేక ఇళ్లు, దుకాణాల పై కప్పులు గాలిలో కొట్టుకుపోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడ విరిగిపడ్డాయి. దీంతో 9 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఒక్కసారిగా వరద పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. తుఫానుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరా తీసి గవర్నర్లతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.
నేషనల్ గార్డులు, వైమానిక దళ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. తుఫానుతో మెక్సికో, దక్షిణ కాలిఫోర్నియాపై పడింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఫ్లోరిడా, అలబామా సముద్రంలో అలలు 2.1 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతుండడంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటిస్తూ, సముద్రంలోకి, తీర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో మూడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో రవాణా స్తంభించిపోయింది. విమానాశ్రయ, రైలు, రవాణా సర్వీసులను ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేశారు.