అందుకోలేని లక్ష్యం ఏదీ లేదు

26-10-2026 | 05:25am
  1. వ్యూహాలకు మరింత పదును
  2. ఇక్కడితో ఆగిపోలేదు, సామర్థ్యాలను మరింత పెంచుకుంటున్నాం
  3. భారత్ స్వదేశీ ఆయుధాలతో శత్రువులకు దడ
  4. భద్రత సుస్థిరానికే ఇండో పసిఫిక్‌లో సైనిక ప్రదర్శనలు
  5. 2047 నాటికి లక్ష్యాలను, దార్శనికతను చాటుతాం
  6. ఐఏఎఫ్ చీఫ్ ఏపీ సింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత సైన్యం (Indian Army)అందుకోలేని లక్ష్యం అంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే వాయుసేన నిరూపించింది. తమ సామర్థ్యం పెరిగినంత మాత్రాన ఇక్కడితో ఆగిపోలేదు. మరిన్ని ప్రత్యామ్నాయాలను సృష్టించుకుంటూ శత్రువుల వ్యూహాలను పటాపంచలు చేసేందుకు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నామని ఏయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు.

దేశ భద్రతను కాపాడేందుకు ఐఏఎఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న అణ్వాయుధాలు, కచ్చితత్వంతో ఛేదించగల అధునాతన క్షిపణి వ్యవస్థలు శత్రువుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయన్నారు.

స్వదేశీ ఆయుధాల శక్తిని శత్రువుకు ఓసారి రుచి చూపించామని (ఆపరేషన్ సిందూర్) ఆ సమయంలో జరిగిన ఘటనలను పునరుద్ఘాటించారు. స్వదేశీ ఉత్పత్తుల తయారీ, రక్షణ రంగం ఆధునికీకరణకే కాకుండా దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి సైతం బాటలు వేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో కొనసాగుతున్న అస్థిరతల నేపథ్యంలో దేశ భద్రతను సుస్థిరం చేసేందుకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శక్తి సామర్థ్యాల ప్రదర్శన ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్ సభ్య దేశాలతో కలిసి భారత్  పనిచేస్తోందని వివరించారు. భారత్ వద్ద ఎల్లప్పుడూ అనేక ప్రత్యామ్నాయాలు, శత్రువు వ్యూహాలలో మార్పులకు అనుగుణంగా ధీటైన సమాధానం ఇచ్చే స్థితిలో ఉన్నామన్నారు. వీటిని మరింత పెంపొందించుకుంటున్నామని వివరించారు.

యుద్ధ విమానాలు, సైనిక వనరుల సంఖ్య పెంచడం అవసరమని, అదే సమయంలో గూఢచార వ్యవస్థ బలోపేతం,  నిఘా, ఎలక్ట్రానిక్ యుద్ధం, డ్రోన్లను అడ్డటించడం లాంటి పటిష్ఠమైన నెట్‌వర్క్ నిర్మాణంలో సామర్థ్యాలను మరింత పెంపొందించుకుంటున్నామని సింగ్ వివరించారు. 2047 నాటికి భారత్ నిర్దేశించుకున్న అభివృద్ధి దార్శనికతను ఐఏఎఫ్ అందుకుంటుందని ఏపీ సింగ్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు