సైబర్ నేరగాళ్లకు కఠినశిక్షలతోనే సరి

29-10-2026 | 05:10am
  1. వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు 
  2. వృద్ధులు, అమాయకులతో చెలగాటమాడుతున్నారు
  3. విచారణకు ముందే శిక్షించే చట్టం ఉంటే అమలు చేయాలి
  4. డిజిటల్ అరెస్టులనేవి డిజిటల్ దోపీడీనే
  5. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సైబర్ నేరగాళ్ల(Cyber Criminals)ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ అరెస్టుల పేరిట అమాయకులను, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలిపింది. విచారణకు ముందే శిక్షించే అవకాశం ఏమైనా చట్టంలో ఉంటే దాన్నీ పరిశీలించాలని అభిప్రాయపడింది.

డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులన్నింటినీ ఒక చోటికి చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా దాన్ని బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం విచారించింది. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు, అమాయకులను లక్ష్యంగా చేసుకొని ముఠాలు రెచ్చిపోతున్నాయని.. డిజిటల్ అరెస్టుల పేరిట భయాందోళనకు గురిచేస్తున్నాయని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Justice Suryakant) ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సాధారణ దోపిడీ కాదని, అసాధారణమైనదని, ఇలాంటి నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

ఆ నేరగాళ్లపై అత్యంత కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘డిజిటల్ అరెస్టులు అనేవి డిజిటల్ దోపిడీగానే చూడాలి. ఈ విషయంలో ఉపేక్షించకూడదు. అమాయకులతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టొద్దు. నేరగాళ్లు వీడియో కాల్స్ ద్వారా దారుణమైన దోపిడీకి పాల్పడుతున్నారు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన 81ఏండ్ల వృద్ధుడ్ని భయభ్రాంతులకు గురి చేసి 1.90 కోట్ల రూపాయలు కాజేశారు. ఇలాంటివి సహించే ప్రసక్తే లేదు’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఎక్కడికి కేసులు అక్కడే విచారణ

దేశవ్యాప్తంగా నమోదైన అన్ని డిజిటల్ అరెస్టు కేసులను కలపలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అలా ఒకే దగ్గరకు తీసుకురావడం వల్ల బాధితులను మరింత ఇబ్బంది పెట్టినట్లవుతుందని, ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంచేసింది. ‘బాధితుల హక్కులే ముఖ్యం. నిందితుల సౌకర్యం కాదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఇద్దరు వ్యక్తులపై ఢిల్లీ, మహారాష్ట్ర తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో నమోదైన సైబర్ నేరాల కేసులను ఒకే చోటికి బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు.

‘వేర్వేరు రాష్ట్రాల్లో విచారణ జరుగుతున్న కేసులన్నింటినీ ఒకే చోట చేర్చడమంటే.. బాధితులందరినీ ఢిల్లీకి రావాలని పిలవడమే. నిందితుల సౌకర్యం కోసం బాధితులను ఇబ్బంది పెట్టలేం. బాధితుల హక్కులకు భంగం కలిగించలేం. మోసానికి గురైన వ్యక్తి డబ్బులు హాంకాంగ్, బ్యాంకాక్‌లోని ఖాతాల్లో జమైతే.. న్యాయం కోసం అక్కడికి వెళ్లాలని వారికి చెప్పగలమా?’ అని సీజేఐ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఏ రాష్ట్రాల్లోని కేసులు ఆ రాష్ట్రాల్లోనే కొనసాగనున్నాయి.

మరిన్ని వార్తలు