మోదీ.. బహిరంగ చర్చకు సిద్ధమా!
- మధ్యవర్తిగా అదానీ లేదా భగవత్ ఉన్నా ఓకే
- చర్చ తర్వాత ప్రధానిగా మోదీ కొనసాగలేరు
- రాహుల్ గాంధీ మరోసారి ఓపెన్ ఛాలెంజ్
- తన ఫోన్ మోదీ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపణ
న్యూఢిల్లీ, నవంబర్ 13: ‘నాతో బహిరంగ చర్చకు సిద్ధమా?’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మోదీతో ముఖాముఖి చర్చకు తాను ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ చర్చ జరిగితే దేశ రాజకీయాలకు సంబంధించి అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని.. చర్చ ముగిసిన తర్వాత మోదీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగడం కూడా కష్టమవుతుందని స్పష్టం చేశారు. చర్చకు వేదికను, మధ్యవర్తిని మోదీనే నిర్ణయించుకోవచ్చని సూచించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను న్యాయనిర్ణేతలుగా నియమించినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ శుక్రవారం నెటిజన్లతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతున్నా.. బహిరంగ చర్చకు ఎందుకు పట్టుబడుతున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తనకు కీలక అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు. ముఖ్యమైన విషయాలు ప్రస్తావించినప్పుడు మైక్ కట్ చేస్తున్నారని విమర్శించారు.
ఆధారాలన్నీ నా ఫోన్‌లోనే: రాహుల్
మోదీ తన ఫోన్‌ను ట్యాపింగ్ చేయిస్తున్నారని కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాంబు పేల్చారు. ప్రధాని మోదీ విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నారన్న ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ తన ఫోన్‌ను చూపించారు. ‘ఆధారాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఫోన్‌లోనే ఉన్నాయి.
ప్రధానికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన నా ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారు. ప్రధాని చర్చకు వచ్చినప్పుడు విదేశీ శక్తుల నియంత్రణలో ఎవరున్నారు? దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది ఎవరు? ఈ పరిణామాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలుస్తాయి’ అని రాహుల్ స్పష్టం చేశారు.
రాహుల్ రాజకీయ గారడీలు: బీజేపీ
రాహుల్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను, బహిరంగ చర్చ సవాల్‌ను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య బద్ధంగా చర్చించే అవకాశాన్ని కాదని.. బయట చర్చ పేరుతో రాజకీయ నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత వంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయ గారడీలకు కాకుండా పార్లమెంటరీ చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవు పలికారు. అయితే.. రాహుల్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి