భీకర దాడులు.. మధ్యప్రాచ్యంలో టెన్షన్
సౌదీపై హౌతీల భీకర దాడులు.. యెమెన్‌లో బాంబుల వర్షం!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. సౌదీ అరేబియా (Saudi Arabia), యెమెన్ హౌతీ తిరుగుబాటు దళాల (Houthi Rebels) మధ్య క్షిపణులు, డ్రోన్లతో దాడులు–ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. శనివారం సౌదీలోని పలు కీలక నగరాలు, ఎయిర్‌పోర్టులు, చమురు సంస్థలే లక్ష్యంగా దాడులు చేసినట్లు హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా ప్రకటించారు. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై రెండు దశల్లో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. యన్బూలోని సౌదీ అరామ్కో (Saudi Aramco) కేంద్రాలు, దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, రియాద్, తాయిఫ్, యన్బూ నగరాల వైపు దూసుకొచ్చిన పలు క్షిపణులను, తూర్పు ప్రావిన్స్‌లో ఓ డ్రోన్‌ను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు (Saudi-led Coalition) తెలిపాయి. అడ్డుకున్న రెండు క్షిపణుల శకలాలు మక్కా, మదీనా ప్రాంతాల్లో పడినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. అయితే, ఆ పవిత్ర నగరాలను లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలను హౌతీలు ఖండించారు. అంతకుముందు 24 గంటల్లో యెమెన్‌లోని తమ ఆధీన ప్రాంతాలపై సుమారు 100 వైమానిక దాడులు జరిగాయని హౌతీలు ఆరోపించారు.
యెమెన్ రాజధాని సనాతో పాటు ఇతర ప్రాంతాలపై జరిగిన Airstrikesలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు హౌతీల ఆధ్వర్యంలోని అల్-మసీరా టీవీ తెలిపింది. సనా ప్రావిన్స్‌లోని హమ్దాన్ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల నివాసాలపై జరిగిన దాడుల్లో ఎనిమిది మంది మరణించగా, మరో పది మందికి పైగా గాయపడినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా, యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సంకీర్ణ దళాలు ‘డాన్ ఆఫ్ యెమెన్’ (Dawn of Yemen) పేరుతో సైనిక చర్యలను తీవ్రతరం చేశాయి. దక్షిణ యెమెన్‌లోని అడెన్ నగరంలోనూ క్షిపణి దాడులు జరిగినట్లు స్థానిక భద్రతా అధికారి వెల్లడించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ (US State Department) సౌదీ అరేబియా సహా పలు మధ్యప్రాచ్య దేశాలకు సంబంధించిన Travel Advisoriesను అప్డేట్ చేసింది. హౌతీల నుంచి ముప్పు ఉందని హెచ్చరించింది. 2014 నుంచి కొనసాగుతున్న యెమెన్ అంతర్యుద్ధం తాజా పరిణామాలతో మరింత తీవ్రం కావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.