త్వరలో ఏరోస్పేస్ పాలసీ 2.0

25-10-2026 | 05:20am
  1. తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి
  2. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి
  3. పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
  4. రక్షా ఎక్స్‌పో కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్‌లో ప్రసంగం

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో రక్షణ రంగ పెట్టుబడులకు మరింత ఊతమిచ్చేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0ను(Aerospace and Defence Policy 2.0) అతి త్వరలోనే ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్‌లో అందరూ భాగస్వామ్యం కావాలని పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో భాగంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో రక్షా ఎక్స్‌పో నిర్వహించనున్నారు.

దీనికి కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్‌ను  శనివారం హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటుచేశారు. రక్షా ఎక్స్‌పో 2026 కర్టెన్ రైజర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించి, ఎగుమతులను పెంచుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో రక్షణ తయారీ, ఏరోస్పేస్, కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ కీలకమని పేర్కొన్నారు. రక్షణ రంగ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. 

కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధం: ఉత్తమ్

రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక ఆవిష్కరణలు చేపట్టేందుకు, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు తెలంగాణకు రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలు, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రత్యేక విడిభాగాల తయారీ పరిశ్రమలతో హైదరాబాద్‌లో బలమైన పారిశ్రామిక వ్యవస్థ ఏర్పడిందని పేర్కొన్నారు.

రక్షా ఎక్స్‌పో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, దేశీయ తయారీని విస్తరించడం, అంతర్జాతీయంగా పోటీపడగల పారిశ్రామిక సరఫరా వ్యవస్థలను నిర్మించడం వంటి భారతదేశ లక్ష్యాల సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించేందుకు రక్షా ఎక్స్‌పో వేదిక దోహదపడుతుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. 

2023 తెలంగాణ నుంచి ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు రూ.15,900 కోట్లకు చేరాయని తెలిపారు. ఆ తర్వాత ఎగుమతులు గణనీయంగా పెరిగాయని,  తాజా గణాంకాల ప్రకారం రూ.32,850 కోట్లకు చేరుకున్నాయని వివరించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు, పెట్టుబడిదారులతో మరింత విస్తృతంగా కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్ష, అంతర్గత భద్రత రంగాలకు చెందిన 90కిపైగా దేశీయ, అంతర్జాతీయ కంపెనీల ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు