బన్సల్ వార్నింగ్
పనిచేయనప్పుడు పార్టీ పదవులెందుకు? తెలం గాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు పదవులకు రాజీనామా చేయండి. సెమినార్లతో జెన్జీ ఉద్యమాలను తిప్పికొట్టాలి. ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలి. ఇక నుంచి తెలంగాణ లోనే ఉంటా.. అన్నీ పరిశీలి స్తా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయజెండా ఎగురవేయాలి.
రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ సునీల్ బన్సల్
అక్టోబర్ 24 (విజయక్రాంతి): బీజేపీ తెలంగాణ(BJP Telangana) రాష్ట్ర వ్యవహా రాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ పార్టీ రాష్ట్ర నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పని చేయనప్పుడు పార్టీ పదవులు ఎందుకు? వేరే వాళ్లకు ఇచ్చేయాలని హెచ్చరించారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి ఆయన రాష్ట్రానికి వచ్చారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు(Party State President Ramchander Rao) అధ్యక్షతన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాల ముఖ్య నాయకులు,
రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సహ ఇన్చార్జులు అభయ్ పాటిల్, రేఖా శర్మ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. పనిచేయని నేతలకు ఆయన గట్టి హెచ్చరికలు జారీచేశారు.
ఇగోలు పక్కనపెట్టి అధికారం కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ ఒక్కటే కాదని.. హైదరాబాద్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తిరిగితే సరిపోదని మండిపడ్డారు. పదవులు పొందిన నాయకులు క్షేత్రస్థాయి వరకు వెళ్లాలని సూచించారు. పని చేయనప్పుడు ఆ పదవులు ఎందుకు? వేరే వాళ్లకు ఇచ్చేయాలని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు పార్టీ పదవులకు రాజీనామా చేసి నియోజకవర్గాలకు వెళ్లి ఇప్పటినుంచే పని చేసుకోవాలని తెగేసి చెప్పారు.
ఇక నుంచి తను తెలంగాణలోనే ఉంటానని, అన్నీ పరిశీలిస్తానని నేతలతో బన్సల్ పేర్కొన్నారు. హంగు, ఆర్భాటాలు చేసే నేతలకు కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తూ.. సభలు, మైకులు వంటి అనవసరమైన ఆర్భాటాలను నేతలు తగ్గించుకోవాలని సూచించారు. నాయకులు బహిరంగ సభలో మాట్లాడితే వచ్చే ఇంపాక్ట్ కంటే కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్లి చిన్న సమూహం వద్ద నలుగురితో చాయ్ తాగి మాట్లాడినా చాలు..
దాని ప్రభావం గట్టిగా ఉంటుందని సూచించారు. చేసిన పనిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లకుంటే.. చేసి ప్రయోజనమేంటని పార్టీ నేతలకు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మరోవైపు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు ఆధారాలతో తిప్పికొట్టాలని నేతలకు బన్సల్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు గట్టిగా నేతలు కౌంటర్ ఇవ్వాలని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు.
మరోవైపు జెన్ జీ ఉద్యమాలను తిప్పికొట్టాలని, అందుకు యువతకు సెమినార్లతో వాస్తవాలు వివరించాలని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్తో పాటు ఈ ఎన్నికలకు సీరియస్గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని నేతలకు బన్సల్ దిశానిర్దేశం చేశారు. అందుకు ఇప్పటినుంచే కష్టపడాలని, పార్టీ ఇచ్చే ప్రతి పిలుపుకనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాల్లో కనీసం రెండు మూడు కార్యక్రమాలైనా పరిపూర్ణంగా అమలుచేయకపోతే ఎలా అని నేతలకు ఆయన ప్రశ్నించారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమాయత్తం చేసి, ప్రజల్లోకి బలంగా వెళ్లాలని పిలుపునిచ్చారు.
అలాగే, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ ‘లోక్తంత్ర బచావో హఠావో’ ఉద్యమంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పోకడలను తిప్పికొడుతూ క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేయాలని ఆయన చెప్పారు. అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్టులో సునీల్ బన్సల్కు బీజేవైఎం నేతలు ఘనస్వాగతం పలికారు. పశ్చిమబెంగాల్ తర్వాత తెలంగాణనే అంటూ నినాదాలు చేశారు.