కాసుల కాళేశ్వరం
- కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్
- డిజైన్ మార్పు బీఆర్‌ఎస్ చారిత్రక తప్పిదం
- కరువును తట్టుకునే సామర్థ్యాన్ని దెబ్బతీశారు
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను ఖాళీ చేస్తాం
- ఎన్డీఎస్‌ఏ సిఫార్సులకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు
- 2027 వర్షాకాలం నాటికే అందుబాటులోకి తెస్తాం
- మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ప్రాణహిత మొదట ప్రతిపాదించిన విధంగానే పూర్తిచేసి ఉంటే ఉత్తర తెలంగాణలో సాగునీటి వ్యవస్థ మరింత బలోపేతమై, కరువు పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం పెరిగేది. ఎల్ నినో వంటి కరువు పరిస్థితులను కూడా సమర్థంగా ఎదుర్కొనేవాళ్లం.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అక్టోబర్ 24 (విజయక్రాంతి): ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరాన్ని రీడిజైన్(Kaleshwaram Project Redesign) చేయడం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదమని, కమీషన్ల కోసమే ఈ డిజైన్ మార్పు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిందని, అయినా రైతులకు సాగునీటి ప్రయోజనాలు అందలేదని మండిపడ్డారు. రాష్ర్టంపై అప్పుల భారం మోపి, కీలక సాగునీటి ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేశారని ధ్వజమెత్తారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను ఖాళీ చేస్తామని, 2027 వర్షాకాలానికి ముందే పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యా చరణను రూపొందిం చినట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత మొదట ప్రతిపాదించిన విధంగానే పూర్తి చేసి ఉంటే ఉత్తర తెలంగాణలో సాగునీటి వ్యవస్థ మరింత బలోపేతమై, కరువు పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం పెరిగేదని మంత్రి పేర్కొన్నారు.
ఎల్ నినో వంటి కరువు పరిస్థితులను కూడా సమర్థంగా ఎదుర్కొనేవాళ్లమని అభిప్రాయపడ్డారు. దాదాపు రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్పులో.. రైతుల దీర్ఘకాల ప్రయోజనాల కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యమిచ్చారని విమ ర్శించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల మూల్యాన్ని రాష్ట్రం భరించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్బీసీ సొరంగం, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసినప్పటికీ పూర్తి చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు.
నాలుగు దశల్లో బరాజ్‌ల పునరుద్ధరణ..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించిన సాంకేతిక పరిశీలనలు, డిజైన్ల ఆమోదాలు, పనుల ప్రారంభం తదితర దశలకు నిర్దిష్ట గడువులతో కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. బరాజ్‌ల పునరుద్ధరణ పను లను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులను భాగస్వాములను చేశామని, పనులను నాలు గు దశలుగా విభజించి పూర్తి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి ప్రాథమిక నమూనాల రూపకల్పన, కాన్సెప్ట్ డిజైన్లు సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తయ్యాయని.. ఈ నెలాఖరు నాటికి అంచనాల తయారీ, ప్రభుత్వ ఆమోదాలు పొందనున్నట్లు తెలిపారు. తదుపరి దశల్లో భాగంగా టెండర్ల ప్రక్రి య పూర్తి చేసి, డిసెంబర్ నెలాఖరులోగా పనులను ప్రారంభించనున్నట్లు వివరించారు. గడువులోగా బరాజ్‌లను తిరిగి అందు బాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు.
పరిశోధనలు, పరీక్షల నిమిత్తం కేంద్ర జల, విద్యుత్ పరిశోధన కేంద్రం సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. ఐఐటీ బాంబేతో కలిసి ఏఎఫ్ ఆర్‌వై సంస్థ డిజైన్లకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.
పునరుద్ధరణ పనులకు సమన్వయ కమిటీ..
జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్‌ఏ) సిఫార్సులకు అనుగుణంగా బరాజ్‌ల పునరుద్ధరణ పనులను సమన్వ యం చేసేందుకు సాంకేతిక నిపుణులు, నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఆనకట్టల ఠైతరువాయి భద్రతా సంస్థ ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
కేంద్ర జలశక్తి శాఖ 2026 జూన్ 30న ఏర్పాటు చేసిన టెక్నికల్ ఓవ్సట్ కమిటీ టీవోసీ, జూలై 31, అక్టోబరు 14 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో పునరుద్ధరణ వ్యూహాన్ని సమీక్షించినట్లు పేర్కొన్నారు. పునరుద్ధరణ డిజైన్లు, అదనపు పనులు టీవోసీతోపాటు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సాంకేతిక పరిశీలనకు లోబడి ఉంటాయని వివరించారు.
బరాజ్‌ల స్టిల్లింగ్ బేసిన్ పొడిగింపునకు ప్రతిపాదనలు..
బరాజ్‌ల స్టిల్లింగ్ బేసిన్ల పొడవును పెంచేందుకు ప్రాథమిక నమూనాల్లో ప్రతిపాదనలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. మేడిగడ్డ బరాజ్ స్టిల్లింగ్ బేసిన్ పొడవు 46.8 మీటర్ల నుంచి 66 మీటర్లకు, అన్నారం 45 మీటర్ల నుంచి 66 మీటర్లకు, సుందిళ్ల 30 మీటర్ల నుంచి 58 మీటర్లకు పెంచేలా నమూనాలు రూపొందించినట్లు వెల్లడించారు. పునరుద్ధరణ సమయంలో, ఆ తరువాత కూడా నీటి ఊటలు, నిర్మాణాలను పైకి నెట్టే నీటి ఒత్తిళ్లు, నిర్మాణాల ప్రవర్తనను గమనించేందుకు సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.