న్యాయ వ్యవస్థను బెదిరించలేరు
- సుప్రీం వరకు ర్యాలీ తీయడమేమిటి?
- రాహుల్ గాంధీపై ధర్మాసనం ఆగ్రహం
- వివరణ ఇవ్వాల్సిందేనని సమన్లు
- రాహుల్, ఒవైసీ పిటిషన్లపై కేంద్రానికి, ఈసీఐకి..
- జంతర్‌మంతర్ హోదా రద్దుపై కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకూ నోటీసులు
- ఇంటర్నెట్ బంద్‌పై.. సుప్రీంకు కేంద్ర హోంశాఖ క్షమాపణ
న్యూఢిల్లీ, అక్టోబర్ 15: సుప్రీంకోర్టు(Supreme Court) వరకు ఇండీ కూటమి ఈనెల 12న చేపట్టిన నిరసన పాదయాత్ర, తత్ఫలితంగా తలెత్తిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ న్యాయవ్యవస్థను ‘ఎవరూ బెదిరించలేరు’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నా రు. అలాంటి ప్రయత్నాలన్నీ బలహీనమైనవని పేర్కొన్నారు. ‘మేము ఏమీ ఏకాంత గోపురాల్లో (ఐవరీ టవర్లలో) కూర్చోలేదు. బయట వారు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో, కోర్టు లో ఏమి చెబుతున్నారో మాకు తెలుసు. మాకు అన్నీ తెలుసు’ అని సీజేఐ స్పస్టం చేశారు.
ఈ భారీ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రవర్తనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఆయ నను సర్వోన్నత న్యాయస్థానం గురువారం మందలించింది. తన చర్యలపై వివరణ ఇవ్వా లని ప్రతిపక్ష నాయకుడికి స్పష్టం చేసింది. మార్చ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ నలుగురు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై కాంగ్రెస్ పార్టీకి, రాహు ల్తో సహా ప్రతిపక్షాల నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, సర్ ప్రక్రియలో జరిగిన అవకతవక లపై ఇండీ కూట మి, ఎఐఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్నికల సంఘం (ఈసీఐ), ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)లకు కూడా విడిగా నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో జంతర్ మంతర్ అంశంపై కూడా ధర్మాసనం స్పందించింది. జంతర్‌మంతర్‌లో నిరసనల రద్దుపై కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేత విషయంలో సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి క్షమాపణ చెప్పారు. శాంతిభద్రతల కోసమే ఇంటర్నెట్పై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నెల 12 మార్చ్‌పై దాఖలైన పిటిషన్‌పై సీజేఐ, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా, ఈ నెల 12న సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సంఘటన పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ధర్మాసనానికి తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ఒక రాజకీయ ఊరేగింపు రావడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయవ్యవస్థను బెదిరించే ఈ రకమైన ప్రయత్నాన్ని అనుమతించలేమని ఆయన అన్నారు. కోర్టు ప్రాంగణంలో రాజకీయ ప్రదర్శనలపై పూర్తి నిషేధం విధించాలని, న్యాయవ్యవస్థకు ఆటంకం కలిగించే రాజకీయ నాయకులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. సీజేఐ స్పందిస్తూ.. ‘మమ్మల్ని ఎవరూ బెదిరించలేరు’ అని అన్నారు. న్యాయవ్య వస్థను బెదిరించే ప్రయత్నం ఆం దోళనకరమని, అలాంటి ప్రయత్నాలన్నీ బలహీనమైనవని స్పష్టం చేశారు.
‘రాజకీయ ర్యాలీలు న్యాయ స్థానం వరకు రావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటివి జరగకూడదు. జుడీషియల్ సిస్టమ్‌ను ఎవరూ భయపెట్టలేరు. ఇవన్నీ కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలే. వీటినీ ఎవ్వరూ పట్టించుకోరు. మేము ఏమీ అనలేము. మేము ఏమీ ఏకాంత గోపురాల్లో లేము. మాకు విషయాలన్నీ తెలుసు’ అని సీజేఐ తెలిపారు. ఈ ర్యాలీ చేపట్టడంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్ పార్టీ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తదితరులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ‘నోటీసు జారీ చేయడం అంటే మేము దేనినీ ఖండిస్తున్నామని కాదు. కానీ దానికి ముందు, ఒక అభ్యంతరం ఉంది.
తదుపరి విచారణ తేదీన పిటిషనర్లలో ఒకరి ప్రవర్తన గురించి మేము ప్రశ్నించాలనుకుంటు న్నాం’ అని రాహుల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో సీజేఐ అన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు, అలాగే ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషికి కూడా సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న సుప్రీంకోర్టు ప్రాంగణంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచాలని ధర్మాసనం ఆదేశించింది.
జంతర్‌మంతర్ హోదా రద్దుపై కేంద్రానికి, పోలీసులకు నోటీసులు
జంతర్ మంతర్‌ను నిరసనల ప్రదేశంగా డీనోటిఫై చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఒకవేళ సమాధానం సంతృప్తికరంగా లేకపో తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ధర్మాసనం తేల్చిచెప్పింది. న్యాయవాది స్వాతి సింగ్ మాలిక్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖ లు చేశారు. జంతర్ మంతర్ హోదా రద్దు చేస్తూ ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సవాలు చేశారు.
నిరసనలను నగరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తే.. అధికారులకు తమ సమస్యలను తెలియజేసే అవకాశం తగ్గిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో జంతర్ మంతర్ హోదా రద్దు నిర్ణయం సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా తీసుకున్నదా? లేదంటే ఆ ప్రాంతం నిరసనల వేదికగా ఎంతవరకు ఉపయోగకరమన్న అంశంపై స్వతంత్రంగా పరిశీలించి నిర్ణయించారా? అని కూడా ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలించి.. సమగ్ర నివేదిక సమర్పించిందని కోర్టుకు వివరించారు.
ఇంటర్నెట్ నిలిపివేతపై.. సుప్రీంకోర్టుకు క్షమాపణలు
ఢిల్లీలో సీజేపీ ఆందోళనల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినందుకు తలెత్తిన కోర్టు ధిక్కరణ కేసులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అత్యున్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణలు తెలిపారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను కాపాడటానికే 24 గంటల పాటు సెల్యులర్ ఇంటర్నెట్పై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, కోర్టు ఉత్తర్వులను ధిక్కరించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తూ అఫిడవిట్ సమర్పించారు.
నాటి అత్యవసర భద్రతా పరిస్థితుల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 10న మధ్య ఢిల్లీలో విధించిన ఆంక్షలకు సంబంధించి తనపై దాఖలైన ధిక్కార కేసులో, ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణకు ముందు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ కూడా సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు.