ఖైరతాబాద్ బరిపై.. గులాబీ గురి

25-09-2026 | 05:40am
  1. దానం దారులన్నీ మూసుకుపోవడంతో ఉప ఎన్నికకు లైన్ క్లియర్
  2. అభ్యర్థి ఎంపికపై బీఆర్‌ఎస్ కసరత్తు షురూ
  3. టికెట్ రేసులో పలువురు నేతలు.. తెరపైకి తలసాని తనయుడి పేరు
  4. రంగంలోకి కేటీఆర్, హరీశ్‌రావు.. నాయకులతో వరుస భేటీలు
  5. స్థానిక బలం, సామాజిక సమీకరణలపై ఆరా
  6. ప్రత్యర్థి బలాబలాలపైనా లెక్కలు

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఖైరతాబాద్ అసెంబ్లీ(Khairatabad Assembly) స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటువేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ సీటు ఖాళీ అయి నట్లు తేలిపోవడమే కాకుండా, ఉప ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఒక్కసారిగా గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఢీ అంటే ఢీ అనేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.

అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణ లు,క్యాడర్‌ను సమాయత్తం చేసే పనులను వేగవంతం చేశాయి.  ముఖ్యంగా బీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికను అత్యం త ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. కాగా, 2023 ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

ఆయనకు 67,368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పీ విజయారెడ్డికి 45,358, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రా రెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ 22,010 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడింది. ఈ ఎన్నికలో విజయం సాధించి కాంగ్రెస్‌కు చెక్ పెటేందుకు బీఆర్‌ఎస్ భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఖైరతాబాద్ పోరు వ్యక్తుల మధ్య కాకుండా.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష సమరంగా మారే అవకాశం ఉంది. 

అభ్యర్థి వేటలో బీఆర్‌ఎస్..

ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావడానికి ముందే బీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపికపై చర్చ మొదలైంది. నియోజక వర్గంలో పార్టీకి ఉన్న పాత క్యాడర్, 2023లో వచ్చిన ఓట్లు, స్థానిక బలం, సామాజిక సమీకరణాలు, గ్రేటర్ రాజకీయాల్లో పరిచయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ నాయ కత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఖైరతాబాద్‌కు చెందిన పార్టీ నాయకులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో పార్టీ పరిస్థితి, బూత్ స్థాయి క్యాడర్, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, బలహీన ప్రాంతాలు, ఇతర పార్టీల ప్రభావం వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అభ్యర్థిని సిఫారసుతో ఖరారు చేయకుండా, ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే స్థానిక సమీకరణాల ఆధారంగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నేప థ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కేటీఆర్, హరీశ్‌రావు సమన్వయం కూడా కీలకంగా మారనుంది. ఒకవైపు అభ్యర్థి ఎంపిక, మరోవైపు స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం, ఇంకోవైపు ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రూపొందించడం వంటి బాధ్యతలు పార్టీ అగ్రనాయకత్వంపై ఉండనున్నాయి.

అభ్యర్థిని ప్రకటించిన తర్వాత అసంతృప్తులకు అవకాశం లేకుండా పార్టీ నేతలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇంఛార్జీలను ఏకతాటిపైకి తీసుకురావడం కీలకంగా మారనుంది. అసెంబ్లీ ఎన్ని కలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు మధ్యంతర పరీక్షలుగా మారుతుంటాయి. ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ విజయం సాధిస్తే ఆ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో తన సంస్థాగత బలాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉం టుంది. దీంతో పాటు ఈ ఎన్నికలో గెలిచి కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది.  

తలసాని తనయుడి వైపే మొగ్గు!

ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో టికెట్ కోసం పలువురు నేత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్‌తో పాటు దివంగత నేత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో విష్ణువర్ధన్‌రెడ్డికి ఖైరతాబాద్‌లో గత రాజకీయ అనుబంధం ఉండగా, తలసాని కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, సామాజిక సమీకరణాలు కలిసొ చ్చే అంశంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో ఖైరతాబాద్ నుంచి పోటీచే సిన దాసోజు శ్రవణ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 2014లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నట్టు  సమాచారం. అయితే సాయికిరణ్ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అ ధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తలసాని కుటుంబానికి గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలతో అనుబంధం ఉండటం, నగర రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు సాయికిరణ్ అభ్యర్థిత్వానికి అనుకూ ల అంశాలుగా మారనున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో చ ర్చించి సాయికిరణ్‌ను బరిలో దింపే అంశా న్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఖైరతాబాద్‌లో స్థానికంగా ఉన్న బలం, క్యాడర్‌పై పట్టు, గత ఎన్నికల అనుభవం, సామాజిక సమీకరణాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేయను న్నది. టికెట్ ఆశావాహుల్లో విష్ణువర్ధన్‌రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ సాయికిరణ్ యాదవ్‌కే టికెట్ ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

కాంగ్రెస్‌కు సవాల్..

ఉప ఎన్నికలో దానం నాగేందర్ అనర్హత అంశం ప్రతిపక్షాలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారే అవకాశం ఉంది. 2023లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన వ్యక్తి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరడం, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, చివరకు అనర్హతకు గురికావడం వంటి పరిణామాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని రద్దుచేసి దానంను అనర్హుడిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని బీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రచారంలో మరింత బలంగా ప్రస్తావించే అవకాశం లేకపోలేదు.

ఇది కేవలం ఖైరతాబాద్ స్థానానికి సంబంధించిన అంశంగా కాకుండా, ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఎన్నుకున్న ఎమ్మెల్యే పార్టీ మారితే దాని రాజకీయ పరిణామాలు ఏమిటి? అనే కోణంలో విస్తృత చర్చగా మళ్లించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌కు ఎంత కీలకమో కాంగ్రెస్‌కు  కూడా అంతే రాజకీయ ప్రాధాన్యం కలిగిన పోరుగా మారనుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన ప్రభుత్వ పనితీరును ప్రచారంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఫిరాయింపులు, దానం అనర్హత వంటి అంశాలు కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుంది.

గత ఎన్నికల్లో 22 వేల మెజార్టీతో గెలుపొందిన బీఆర్‌ఎస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉండటం సానుకూల పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే 2023లో వచ్చిన ఓట్లను నిలబెట్టుకోవడంతో పాటు అదనపు మద్దతు సమీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక బీజేపీ తన ఓటు శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే పోటీ బహుముఖంగా మారనుంది.

మరిన్ని వార్తలు