హైప్ జ్యాదా!
వాదా వద్దు.. కంటెంట్ ముద్దు
ఇటీవల చిత్ర పరిశ్రమలో(Film industry) ఒక కొత్త ట్రెండ్ మూవీ మేకర్స్‌కు హై ఇస్తోంది! కానీ, తద్వారా అంతకంటే పెద్ద ప్రమాదం వారికే అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా కథ, కథనాల కంటే భారీ హైప్ క్రియేట్ చేయడం, ప్రమోషన్స్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టడం ఇండస్ట్రీని శాసిస్తోంది. మొత్తం సినిమా బడ్జెట్‌లో ఏకంగా 20 శాతం కేవలం ప్రచారానికే కేటాయిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ అతివ్యాప్తి చివరకు థియేటర్లలో చతికిలపడుతోంది. భారీ అంచనాలతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి కంటెంట్ లేకపోవడంతో తీవ్ర నిరాశే మిగులుతోంది. ఫలితంగా, విడుదలైన మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుని కోట్లు నష్టపోతున్న చిత్రాల సంఖ్య పెరుగుతోంది.
- ప్రతిజ్ఞ చేస్తే అతిగా కాదు, అతికినట్టుండాలి!
- సినిమా బడ్జెట్‌లో 20% ప్రచారానికే!
- ఫస్ట్‌డే కలెక్షన్లపైనే యావ.. కెరీర్ తప్పుతుందేమో తోవ
- తర్వాత విమర్శలు స్వీకరించడం కాదు.. ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష
ఏ సినిమా అయినా ప్రేక్షకుడిని నూటికి నూరు శాతం సంతృప్తిపర్చలేదు. కానీ, మేకర్స్ ప్రయత్నంలోనే లోపమే ప్రేక్షకుల పాలిట శాపంగా మారితే! పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి తీసిని సినిమా అంటూ, అంతకు రెట్టింపును తిరిగి రాబట్టుకోవాలన్న యావ సగటు ప్రేక్షకుడికి విసుగు పుట్టిస్తోంది. డైరెక్టర్లు, స్టార్ హీరోల మీద నమ్మకం అంతకంతకూ సన్నగిల్లేలా చేస్తోంది. ఇటీవల మూవీ మేకర్స్ తీరు కొండంత రాగం తీసి, గోరంత పాట పాడిన చందంగా తయారైంది.
వారి ప్రచార శైలి ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నది. గతంలోనూ ఇలాంటి ధోరణి ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఇది మరింత ఎక్కువైంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రకటించిన సినిమా ‘టాక్సిక్’. ఈ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, కథలో బలం లేకపోవడం, కథనం నెమ్మదించడంతో విమర్శకులు దీనిని ఒక ‘అంబిషియస్ మిస్‌ఫైర్’ (ఆశయం ఉన్నా గురితప్పిన) చిత్రంగా అభివర్ణించారు.
తాజాగా విడుదలైన ‘ది ప్యారడైజ్’(The Paradise) చిత్రం కూడా ఇదే కోవకు చెందుతుందని చెప్పొచ్చు. నాని హీరోగా నటించిన ఈ సినిమాకూ భారీ విమర్శలు తప్పడంలేదు. ప్రచార చిత్రాలు, ఇంటర్వ్యూలతో సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచేశారు. తీరా థియేటర్‌కు వెళ్తే, ప్రేక్షకుడికి నిరాశే ఎదురైంది. ప్రచార కార్యక్రమాల్లో చెప్పినట్టు సినిమాలో ప్రేక్షకుడిని కట్టేసే భావోద్వేగాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన చిత్రాల జాబితాలో నిలిచిందీ సినిమా. గతంలోనూ పాన్-ఇండియా ఇమేజ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, విదేశాల్లో ఈవెంట్లు చేసి, గ్రాఫిక్స్ నమ్ముకుని తీసిన పలు సినిమాలు కథా లోపంతో ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
‘ది రాజా సాబ్’కూ ఇదే అనుభవం ఎదురైంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్-కామెడీ చిత్రంపై ‘కల్కి’ విజయం తర్వాత విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. భారీ వీఎఫ్‌ఎక్స్, ప్రమోషన్స్ నమ్ముకున్న ఈ చిత్రం బలహీనమైన కథనం, పేలవమైన స్క్రీన్‌ప్లే కారణంగా నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మణిరత్నం, కమల్‌హాసన్ కాంబినేషన్ అనగానే ‘థగ్ లైఫ్’ చిత్రంపైన కూడా దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. కానీ విజువల్స్ పరంగా రిచ్‌గా ఉన్నప్పటికీ, కథ పరంగా డొల్లతనం స్పష్టంగా కనిపించడంతో ప్రేక్షకులు దీనిని తిరస్కరించారు.
ప్రమోషన్స్ గెలుస్తున్నాయి.. సినిమా ఓడుతోంది!
నేటి డిజిటల్ యుగంలో టీజర్లు, ట్రైలర్లు, సోషల్ మీడియా రీల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా సినిమాను ‘మస్ట్ వాచ్’ అనే రేంజ్‌కు తీసుకెళ్తున్నారు. ఈ హైప్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్, మొదటి రోజు కలెక్షన్లు వస్తున్నాయి. కానీ, సినిమా బాగుంటేనే నిలబడుతుంది. కథ లేకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్లతో ప్రేక్షకులను ఎక్కువ రోజులు థియేటర్లకు రప్పించలేరనేది తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
పబ్లిసిటీ అనేది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఒక సాధనం మాత్రమే, అదే సినిమా విజయాన్ని నిర్ణయించలేదు. కోట్లకు కోట్లు పబ్లిసిటీపై తగలేసే బదులు, అందులో సగం ఖర్చు స్క్రిప్ట్ వర్క్ మీద, కథా బలం మీద పెడితే ఇండస్ట్రీకి ఆరోగ్యకరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ కళ్ళు తెరిచి ’హైప్’ కంటే ’కంటెంట్’ కే ప్రాధాన్యత ఇస్తారని ఆశిద్దాం.
విమర్శకులు ఎత్తిచూపుతున్న ప్రధాన లోపాలివే..
సినిమా విశ్లేషకులు, ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్లో పలు లోపాలను ఎత్తిచూపుతున్నారు. వాటిలో ప్రధానంగా స్టోరీ ఏం లేకపోవడం, ఆకట్టుకోని కథనం, భావోద్వేగాలు పండకపోవడం వంటి మూడు లోపాలు సగటు ప్రేక్షకుడికి స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. హీరోల ఇమేజ్, భారీ యాక్షన్ సీక్వెన్సులను నమ్ముకుంటున్నారు తప్ప, ఒక బలమైన కథను సిద్ధం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. కథలో వేగం లేకపోవడం, అనవసరమైన సీన్లతో సాగదీయడం వల్ల ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతున్నాడు. ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా ప్రేక్షకుడి మనసుకు హత్తుకునే ఎమోషన్ ఉండాలి. అది మిస్ అవ్వడం వల్లే కనెక్ట్ కాలేకపోతున్నారు.
పరిశ్రమ ప్రముఖుల మాటల్లో..
టాలీవుడ్‌లో ప్రచార ఆర్భాటాలపై ఇండస్ట్రీ ప్రముఖులు పలు సందర్భాల్లో తమ గళాన్ని ఇలా వినిపించారు..
అవేవీ ఇండస్ట్రీని కాపాడలేవు: దిల్ రాజు (నిర్మాత)
కేవలం భారీ బడ్జెట్, ఓపెనింగ్స్, మీడియా అటెన్షన్ మాత్రమే ఇండస్ట్రీని కాపాడలేవు. చిత్ర పరిశ్రమ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పబ్లిసిటీ కంటే కంటెంట్ -ఓరియెంటెడ్ సినిమాలు రావడం ముఖ్యం. అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు క్రమం తప్పకుండా వస్తారు.
ఇన్వెస్టర్లే తప్ప నిజమైన నిర్మాతలు లేరు: రామ్ గోపాల్ వర్మ (డైరెక్టర్)
చాలా మంది కేవలం ఇన్వెస్టర్లుగా మారుతున్నారు తప్ప నిజమైన నిర్మాతలు కాలేకపోతున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యాక బడ్జెట్ ఎక్కడ ఆపాలో తెలియక ఊబిలో పడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ ఖర్చు రూ.100 కోట్ల నుంచి 200 కోట్లకు పెరిగితే ఆర్థిక క్రమశిక్షణ కోల్పోతున్నారు.
పెయిడ్ ప్రమోషన్స్‌తో గందరగోళం: సాయి రాజేశ్ (దర్శక నిర్మాత)
యూట్యూబ్ వ్యూస్, ‘ఎక్స్’ ట్రెండ్స్, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్లను పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా కృత్రిమంగా పెంచుతున్నారు. దీనివల్ల ప్రేక్షకులు నిజంగా టీజర్ లేదా సాంగ్‌కు కనెక్ట్ అయ్యారా.. లేదా? అనేది నిర్మాతలు అంచనా వేయలేకపోతున్నారు.
పాన్-ఇండియా అనేది ఒక మాయ: సీ కల్యాణ్ (నిర్మాత)
పాన్-ఇండియా అనేది ఒక మాయగా మారుతోంది. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ రేట్లు కూడా భారీగా పడిపోవడంతో నష్టాలు వస్తే భరించడం నిర్మాతలకు కష్టంగా మారుతోంది.