విద్యార్థికి నోటీసా.. ఎంత ధైర్యం?
- తమ ఆదేశాలనే పెడచెవిన పెడతారా?
- సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం
- విద్యార్థుల్లో భయాందోళన సృష్టించొద్దు
- వివరణ కోరతాం, నోటీసులు రికార్డుల్లోనే ఉంచాలి
- గ్రేటర్ నోయిడా మేజిస్ట్రేట్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు నిలదీత
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాక్రోచ్ జనతాపార్టీ(Cockroach Janata Party) (సీజేపీ) నిరసనల్లో పాల్గొన్న విద్యార్థి(Student)కి ఢిల్లీ(Delhi)లోని గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్-3 కోర్టు నోటీసు జారీచేయడం పట్ల సీజేఐ సూర్యకాంత్(CJI Surya Kant) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘న్యాయ విద్యార్థికి నోటీసా? ఎంత ధైర్యం? ఈ సాహసం ఏ మెజిస్ట్రేట్ ఎలా చేయగలరు? అని గ్రేటర్ నోయిడా మెజిస్ట్రేట్‌ను(Greater Noida Magistrate) మందలించారు. విద్యార్థుల(Students)పై బలవంతపు చర్యలు వద్దని గతంలోనే సుప్రీంకోర్టు(Supreme Court) జారీ చేసిన ఉత్తర్వులను పెడచెవిన పెట్టారా? అని మండిపడ్డారు.
విద్యార్థి అక్షత్ త్రిపాఠికి రూ.5 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్‌కే సిసోడియా జారీ చేసిన నోటీసుపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని, అయినా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు ఎలా జారీ చేస్తారని నిలదీశారు. విద్యార్థులపై బలవంతపు చర్యలు ఉండవన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ అంశంపై గ్రేటర్ నోయిడా అథారిటీ(Greater Noida Authority) నుంచి వివరణ కోరతామని, నోటీసులు రికార్డులో ఉంచాలని దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి చర్యలతో విద్యార్థులలో భయాందోళన వాతావరణాన్ని సృష్టించొద్దని వివరణ కోరతామని సీజేఐ సూర్యకాంత్ ప్రకటించారు. జూలై 20 నుంచి 25 మధ్య దేశవ్యాప్తంగా సీజేపీ నేతృత్వంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు రద్దు చేసింది.
కాగా సీనియర్ న్యాయవాది బిశ్వజిత్ భట్టాచార్య మాట్లాడుతూ.. నోటీసు జారీ చేసిన విషయం వాస్తవమేనని, ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకున్నారని సుప్రీంకోర్టుకు నివేదించారు. అక్షత్ త్రిపాఠి తనకు జారీ చేసిన నోటీసులపై మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ రూ.5 లక్షల పూచీకత్తు, బీఎన్‌ఎస్‌ఎస్ లాంటి కఠిన చట్టాలను తనపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.