అమెరికా గడ్డ మీద చైతన్య గానం
ఆదిలాబాద్లో పుట్టి పెరిగి.. అమెరికా గడ్డ మీద మన సంగీత వైభవాన్ని చాటిచెప్తున్నారు చైతన్య. అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఒకవైపు క్యాన్సర్ డ్రగ్స్ పరిశోధన విభాగంలో పని చేస్తూనే.. మరోవైపు అక్కడి యువతకు భారతీయ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఆ సంగీత కళాకారిణిపై ప్రత్యేక కథనం..
చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు చైతన్య. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సంగీత సాధనను(Musical Practice) ప్రారంభించి, ప్రముఖ గురువుల వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. పలు జాతీయ స్థాయి పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి ఎన్నో పురస్కారాలను దక్కించుకున్న చైతన్య.. ప్రస్తుతం అమెరికాలో ఔత్సాహిక చిన్నారులకు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోని గొప్ప తనాన్ని విదేశీ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు.
గురువుల ప్రోత్సాహంతో..!
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాజేశ్వర్ రావు, మీనాక్షి దంపతుల పుత్రిక చైతన్య. ఆమె తొలుత ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సతీశ్ దేశ్ పాండే, శైలజా దేశ్ పాండే దంపతుల వద్ద హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. గాత్రంతో పాటు హార్మోనియంలోనూ శిక్షణ పొందారు. నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుకున్నారు. అనంతరం నాందేడ్ లోని రామానంద తీర్థ విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో ప్రొఫెసర్ శ్యాం గుంజ్ కర్ వద్ద సంగీతంలో మరిన్ని మెళకువలను నేర్చుకున్నారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సహంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సంగీత కార్యక్రమాల్లో పాల్గొని.. అవార్డులు అందుకున్నారు.
సంస్కృతికి వారసత్వంగా..!
ఆదిలాబాద్ కు చెందిన చైతన్య ఒకవైపు సంగీత విద్యలో సాధన చేస్తూనే మరోపక్క మహారాష్ట్రలోని అమరావతి యునివర్సిటీ నుంచి బీఫార్మసి పూర్తి చేశారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియాలోని నేషనల్ యూనివర్సిటి నుంచి హెల్త్ ఇన్ ఫార్మాటిక్స్లో ఎం.ఎస్. పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని నార్త్ కెరోలినా రాష్ట్రం రాలీ సిటీలో నివాసం ఉంటున్నారు. అక్కడ క్యాన్సర్ డ్రగ్స్ పరిశోధన విభాగంలో పని చేస్తునే.. అక్కడి యువతలో భారతీయ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తిని పెంచేందుకు ఆమె కృషి చేస్తున్నారు.
సంప్రదాయ సంగీతాన్ని కేవలం కచేరీలకే పరిమితం చేయకుండా, నేటి తరానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నారు. సంగీతాన్ని వృత్తిగా మాత్రమే కాకుండా ఒక సాధనగా, సంస్కృతికి వారసత్వంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. చైతన్య తన గానంలో శాస్త్రీయ సంగీత సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూనే, భావవ్యక్తీకరణకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ అంతర్జాతీయ వేదికలపై మన్ననలు అందుకుంటున్నారు.