రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు

01-10-2026 | 09:46pm

- జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య

నస్పూర్,(విజయక్రాంతి): రక్తదానం(Blood Donation) చేయడం ద్వారా అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని(National Voluntary Blood Donation Day) పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society), జిల్లా రక్త నిధి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనత వంటి వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు ప్రమాదాలలో గాయపడి అత్యవసరంగా రక్తం కావలసి ఉన్నవారి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్త నిధి కేంద్రానికి రక్తదాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు, సింగరేణి సంస్థ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల యాజమాన్యాలు, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని తెలిపారు.

అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందిస్తూ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మంది ప్రాణాలను కాపాడటంలో రక్తదాతల సహకారం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అనంతరం అత్యధిక సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన రక్తదాతలు, ప్లేట్లెట్స్ దానం చేసిన స్వచ్ఛంద రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు