సైబర్ నేరాలపై అప్రమత్తతే ప్రధానం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సైబర్ నేరాల(Cyber Crimes) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితిక పంత్(Asifabad SP Nitika Pant) సూచించారు. అక్టోబర్ నెలంతా నిర్వహించనున్న సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో విద్యార్థులతో కలిసి పోలీసుల ఆధ్వర్యంలో ఫాస్ట్ మార్చ్ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు తెలియజేయకూడదన్నారు. ఫోన్కు బలమైన పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లు ఇతర దేశాల్లో ఉండి కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి, సంబంధిత బ్యాంకుకు సమాచారం అందిస్తే ఖాతాలను నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. చదువుకున్న వారు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారని, వాటి నివారణకు అప్రమత్తతే ప్రధానమన్నారు. నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, సీఐ నీలం రవి, ఐటీ కోర్ సీఐ రవీందర్, ఎస్సైలు మోహన్ ప్రసాద్, ఉల్లాస్, ఆర్ఎస్ఐ కిరణ్, ఏఎస్సైలు మెంగారావు, భోజగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.