నాచారం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్బన్ నానో కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మైబెల్లి, మల్కాజిగిరి సైబర్ క్రైమ్ విభాగం ఎస్సై శ్రీనివాస్, సైబర్ వారియర్ అనిల్ (పీసీ–12970), పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు.
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, హానికరమైన ఏపీకే లింకులు, మ్యాట్రిమోనియల్ మోసాలు, సెక్స్టార్షన్, ఆన్‌లైన్ ఉద్యోగ మోసాలు, లక్కీ డ్రా మోసాలు, లోన్ యాప్ మోసాలు, పెట్టుబడి మోసాల గురించి వివరించారు.సైబర్ నేరగాళ్లు ఉపయోగించే కొత్త పద్ధతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలు లేదా లింకులు వచ్చినప్పుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమం ముగింపులో విద్యార్థులు సైబర్ భద్రతకు సంబంధించిన సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.






