పుస్తక ఆవిష్కరణలో బండి సంజయ్
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ(Poet Sabbani Lakshminarayana) రచించిన “అవ్వ స్మృతి కవిత” బెంగాలీ భాషలోకి “అవ్వ ఏక్తీ ఎలిజి” పేరున అనువాదము అయ్యింది. సబ్బని తన తల్లిపై తెలుగులో వ్రాసిన అవ్వ స్మృతి కవిత, ఇప్పటి వరకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్ భాషల్లోకి అనువాదం అయ్యింది. ఇప్పుడు దీనిని ప్రముఖ బెంగాలీ కవయిత్రి కాబేరి చటోపాధ్యాయ బెంగాలీ భాషలోకి అనువదించారు.
బుధవారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay Kumar) వారి నివాసంలో ఈ అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ సబ్బని కృషిని అభినందించారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, చొప్పదండి మాజీ శాసన సభ్యులు బొడిగె శోభారాణి, ఇంజనీర్ కోలా అన్నారెడ్డి, అరబిందో సొసైటీ కరీంనగర్ కార్యదర్శి ఉప్పల రామేశం తదితరులు పాల్గొన్నారు.