బాపూజీ ఆశయాలే స్ఫూర్తి
సొసైటీ చైర్మన్, వ్యాపారవేత్త గాదె అవినాష్
వాంకిడి, (విజయ క్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో సోమవారం లక్ష్మణ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ(Lakshmana Seva Sadan Welfare Society) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం బుద్ధ విహార్‌లో అరటిపండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్, వ్యాపారవేత్త గాదె అవినాష్ మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు.
ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బాపూజీ పుట్టిన వాంకిడి గడ్డపై ఆయన ఆశయాలను కొనసాగించడం తమకు గర్వకారణమని అన్నారు. ఆయన చూపిన సేవా మార్గంలో పయనిస్తూ పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా లక్ష్మణ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ పనిచేస్తోందని తెలిపారు. బాపూజీ జయంతి, వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనను స్మరించుకుంటున్నామని చెప్పారు.కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అశోక్ ముహుల్కర్, ప్రధాన కార్యదర్శి మడావి దౌలత్, ఆర్‌పీఐ జిల్లా అధ్యక్షుడు సామ్రావ్ డోన్దోజి దుర్గే, అంబేద్కర్ సంఘం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కోబ్రాగడే విలాస్, సమతా సైనిక దళ్ జిల్లా ఆర్గనైజర్ రోషన్ ఉప్రే తదితరులు పాల్గొన్నారు.