గణేశ్ నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధం
భారీగా భద్రతా బలగాల మోహరింపు
ట్రాఫిక్ ఆంక్షలు అమలు
మధ్యాహ్నంలోపే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గణపయ్యల నిమజ్జన(Ganesh immersion) మహోత్సవానికి భాగ్యనగరం సర్వసిద్ధమైంది. నగర నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టుపక్కల చెరువులు, కుంటల వైపు శోభాయాత్రగా తరలివెళ్తున్నాయి. శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సీపీ కంట్రోల్ రూమ్(Control Room) ఆధ్వర్యంలో పటిష్ఠమైన ఏర్పా ట్లుచేశారు.
ప్రసిద్ధ ఖైరతాబాద్ గణనాథునిడి(Khairatabad Ganesh)కి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ముగింపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, భారీ క్రేన్ల సహాయంతో విగ్రహాన్ని శోభాయాత్రకు సిద్ధం చేసే పని లో నిమగ్నం అయ్యారు. నిమజ్జనానికి విజయవాడ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక లష్కర్లు ఖైరతాబాద్ నాథుడు శోభాయాత్రగా కదలనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం లోపే నిమజ్జనం చేయనున్నారు. కాగా నిమజ్జన మార్గాల్లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేలాది సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రధాన కూడళ్లు, హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సీసీ నిఘాను నిరంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. 26 బృందాలతో షీ టీమ్స్ నిఘా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దుర్గం చెరువులో విగ్రహాల నిమజ్జనాన్ని పూర్తిగా నిషేధించారు. భక్తులు సమీపంలోని బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచించారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసివేసి ఉంటాయని అధికారులు తెలిపారు.
బాలాపూర్, చార్మినార్, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వైపు సాగే ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో సాధారణ వాహనాలపై ఆంక్షలు విధించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వందలాది ప్రత్యేక బస్సులను, మెట్రో రైలు అర్ధరాత్రి వరకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 14న ఘనంగా ప్రారంభమైన బాలాపూర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా అనంత చతుర్దశిని పురస్కరించుకుని గణేష్ నిమజ్జనం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లడ్డూ వేలం పాటకు సంబంధించి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి పూర్తి వివరాలు వెల్లడించింది.