ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు మోక్షం ఎప్పుడో

01-10-2026 | 08:24pm

ఇద్దరు ఎమ్మెల్యేల శంకుస్థాపనలు

తీరని వ్యాపారుల సమస్య 

ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాని సమీకృత కూరగాయల మార్కెట్‌

రోడ్లపైనే చిరు వ్యాపారుల అవస్థలు

ఎండా, వానా, దుమ్మూధూళిలోనే వ్యాపారాలు

భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులకు సౌకర్యవంతమైన మార్కెట్‌ ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఏళ్లుగా కాగితాలకే పరిమితమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఒకసారి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మరోసారి మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగినప్పటికీ.. నేటికీ వ్యాపారులకు మాత్రం శాశ్వత పరిష్కారం లభించలేదు. దీంతో కూరగాయలు, పండ్లు, ఇతర చిరు వ్యాపారాలు(Small businesses) నిర్వహించే వ్యాపారులు రోడ్ల పక్కనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెండు ప్రభుత్వాలు.. రెండు శంకుస్థాపనలు

గత టీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో 2022 మార్చి 4న అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkata Ramana Reddy) చేతుల మీదుగా టీయూఎఫ్‌ఐడీసీ నిధులు(TUFIDC funds) రూ.4.50 కోట్లతో మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొంతకాలం నిర్మాణ పనులు కొనసాగినప్పటికీ.. పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు.అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు 2026 జనవరి 4న సమీకృత కూరగాయలు, మాంసాహార మార్కెట్‌ నిర్మాణానికి నగర అభివృద్ధి నిధుల నుంచి రూ.6 కోట్లు కేటాయిస్తూ మరోసారి శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపైనే వ్యాపారాలు

మార్కెట్‌ నిర్మాణం పూర్తికాకపోవడంతో చిరు వ్యాపారులు రోడ్ల వెంట, ప్రధాన కూడళ్ల వద్ద తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రత, వర్షాలు, దుమ్మూధూళి మధ్య వ్యాపారాలు చేయాల్సి రావడంతో వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వ్యాపారాలు కొనసాగుతుండటంతో పాదచారులు, వాహనదారులకు కూడా అసౌకర్యం కలుగుతోంది.

ఇకనైనా నిర్మాణం పూర్తి చేయాలి

ప్రజలకు, వ్యాపారులకు ఉపయోగపడేలా నిర్మించాల్సిన మార్కెట్‌ విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిధులు కేటాయించి శంకుస్థాపనలు చేయడం కాకుండా పనులను వేగవంతం చేసి మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణ పనులను పూర్తి చేసి తమకు శాశ్వత వ్యాపార వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు